ఆర్టీసీ సర్వీసులు ప్రారంభించడంపై నేడే నిర్ణయం?

May 15, 2020


img

సిఎం కేసీఆర్‌ ఇవాళ్ళ ప్రగతి భవన్‌లో కొందరు మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులను నడిపించడంపై ఈరోజు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకొంటామని సిఎం కేసీఆర్‌ ఇదివరకే చెప్పారు కనుక ఆర్టీసీ అధికారులు కూడా బస్సులను నడిపించేందుకు తగిన ప్రణాళికలు సిద్దం చేసుకొన్నారు. ముందుగా గ్రీన్, ఆరెంజ్‌ జోన్‌లలో దూరప్రాంతాలకు నాన్ స్టాప్ లగ్జరీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సులను నడిపించాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. అయితే సామాజిక దూరం పాటించాలంటే ఒక్కో బస్సులో 50 శాతం సామర్ధ్యంతోనే నడిపించవలసి ఉంటుంది కనుక ఆర్టీసీకి లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుంది. కనుక టికెట్ ఛార్జీలను 20 నుంచి 25 శాతం పెంచవలసి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నందున ఇప్పట్లో సిటీ బస్సులు నడిపించే అవకాశం ఉండకపోవచ్చు. 

కేంద్రప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ మే 17తో ముగియనుంది. లాక్‌డౌన్‌ మళ్ళీ పొడిగిస్తామని ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా చెప్పారు. కానీ ఈసారి లాక్‌డౌన్‌ పూర్తి భిన్నంగా ఉంటుందని చెప్పారు. అంటే మరిన్ని ఆంక్షలు సడలించి అన్ని రకాల ప్రజారవాణా వ్యవస్థలను ప్రారంభించేందుకు అనుమతించవచ్చు. కనుక మే17 లేదా మే29 తరువాత హైదరాబాద్‌ మెట్రో సర్వీసులను కూడా ప్రారంభించడంపై నేటి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ముఖ్యంగా గ్రీన్, ఆరెంజ్‌ జోన్‌లలో ఆంక్షల సడలింపుపై చర్చ జరుగనుంది కనుక ఈరోజు సాయంత్రం సిఎం కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి ప్రభుత్వ నిర్ణయాలను ప్రకటించవచ్చు.


Related Post