తెలంగాణలో మళ్ళీ రాజకీయవేడి

May 14, 2020


img

కరోనా..లాక్‌డౌన్‌తో గత 50 రోజులుగా రాష్ట్రంలో రాజకీయాలు చాలా తగ్గాయి. కానీ శ్రీశైలం రిజర్వాయరులోని కృష్ణ జలాల వినియోగంపై ఏపీ-తెలంగాణ ప్రభుత్వాల మద్య తాజాగా మొదలైన యుద్ధంతో రాష్ట్రంలో మళ్ళీ రాజకీయవేడి పెరిగింది. ఇప్పుడు దాని లోనికి ప్రతిపక్ష నాయకులు కూడా ప్రవేశించి టిఆర్ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తుండటంతో ఆ వేడి ఇంకా పెరిగిపోయింది. 

బుదవారం రాష్ట్ర కాంగ్రెస్‌, బిజెపి, టిజేఎస్‌ నేతలు తమతమ కార్యాలయాలలో నిరసన దీక్షలు చేశారు. గాంధీభవన్‌లో దీక్ష చేసిన ఉత్తమ్‌కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “నీళ్ళ పంపకాలలో అన్యాయం జరుగుతోందనే పోరాడి తెలంగాణ సాధించుకొన్నాము. కానీ సిఎం కేసీఆర్‌, ఏపీ సిఎం జగన్‌తో కుమ్మక్కయ్యి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు నీటి సామర్ధ్యాన్ని 80,000 క్యూసెక్కులకు పెంచితే ఇంతకాలం మౌనం వహించి కేసీఆర్‌ ఇప్పుడు హడావుడి చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం తలపెట్టిన పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ పూర్తయితే దక్షిణ తెలంగాణ అంతా ఎడారిగా మారిపోతుంది. ఒకవేళ సిఎం కేసీఆర్‌ దానిని అడ్డుకోలేకపోతే తన పదవికి రాజీనామా చేసి తప్పుకొంటే మంచిది. పోతిరెడ్డిపాడు పనులు మొదలుపెడితే మేము అక్కడకు వెళ్ళి నిరసనలు చేపడతాము,” అని అన్నారు. 

రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్‌కు తెలియకుండానే నీటిపారుదల శాఖలో మురళీధర్ రావు అనే అధికారి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో నీటి సామర్ధ్యాన్ని 2 నుంచి ఒక టీఎంసీలకి తగ్గించగలరా? అంటే ఇద్దరు సీఎంలు మాట్లాడుకొన్నాకనే ఇవన్నీ జరుగుతున్నాయని అర్ధం అవుతోంది,” అని అన్నారు.    

ఖమ్మంలో దీక్ష చేపట్టిన భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ, “ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారు. అందుకే ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసిందని భావిస్తున్నాము. అయితే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును  మేము తప్పకుండా అడ్డుకొంటాము,” అని అన్నారు. 

రాష్ట్ర బిజెపి నేతలు కూడా ఇంచుమించు ఇదేవిధంగా టిఆర్ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. టిజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం కూడా ఏపీ ప్రభుత్వం చేపట్టబోతున్న ఈ ప్రాజెక్టుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 

కాంగ్రెస్‌ నేతల విమర్శలు, ఆరోపణలకు టిఆర్ఎస్‌ కూడా ధీటుగానే సమాధానం చెప్పింది. టిఆర్ఎస్‌ సీనియర్ నేత కర్నె ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ, “ఆనాడు రాజశేఖర్ రెడ్డి హయాంలో ఏపీకి నీళ్ళు పారించుకుపోతుంటే మంత్రి పదవులకు ఆశపడి హారతులు పట్టిన కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు తెలంగాణకు అన్యాయం జరిగిపోతోందంటూ గగ్గోలు పెడుతుండటం విడ్డూరంగా ఉంది. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటం కోసమే మేము ఈ పోరాటం మొదలుపెడితే, కాంగ్రెస్‌ నేతలు తమ రాజకీయ మనుగడ కోసం మాపై బురద జల్లాలని ప్రయత్నిస్తున్నారు,” అని విమర్శించారు. 


Related Post