వలస కార్మికులతో పెరుగుతున్న కరోనా కేసులు

May 14, 2020


img

తెలంగాణలో ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రాంతాలలో మాత్రమే ఇప్పటివరకు రోజూ కరోనా కేసులు నమోదవుతుండేవి కానీ ఇప్పుడు శ్రామిక్ రైళ్ళ ద్వారా వివిద రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి చేరుకొంటున్న వలస కార్మికుల ద్వారా రాష్ట్రంలో మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. బుదవారం ఒక్కరోజే కొత్తగా 41 పాజిటివ్ కేసులు నమోదు కాగా వాటిలో 31 జీహెచ్‌ఎంసీ, 10 వలస కార్మికులకు చెందినవని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలియజేసింది.

నిన్న నమోదైన కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,367కి చేరింది. వారిలో 394 మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతుండగా 939 కోలుకొని ఇళ్లకు చేరుకొన్నారు. అంటే 40 రోజుల క్రితం ఆసుపత్రులలో చేరిన వారందరూ డిశ్చార్జ్ అయ్యారని స్పష్టం అవుతోంది. ఒకవేళ జీహెచ్‌ఎంసీ, వలస కార్మికుల కొత్త కేసులు లేకపోయుంటే ఇప్పుడు ఆసుపత్రులలో ఒక్క పేషంట్‌ కూడా ఉండేవారు కాదు.

వివిద రాష్ట్రాల నుంచి తెలంగాణకు తిరిగివస్తున్న వలస కార్మికులు వివిద జిల్లాలకు చెందినవారు కనుక వారిని ఆయా జిల్లాలు వారీగా చూపినట్లయితే రాష్ట్రంలో మళ్ళీ అన్ని జిల్లాలలో కరోనా వ్యాపించినట్లు పరిగణింపబడుతుంది కనుక వారు ఏ జిల్లాలకు చెందినవారైనప్పటికీ వలస కార్మికులుగా మాత్రమే చూపించడం మంచి నిర్ణయమే. ఇప్పటి వరకు మొత్తం 35 మంది వలస కార్మికులకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది.

వివిద రాష్ట్రాల నుంచి తెలంగాణకు తిరిగివస్తున్న వలస కార్మికులు రైల్వే స్టేషన్లో దిగగానే నేరుగా క్వారెంటైన్‌కు తరలించి వైద్య పరీక్షలు చేయిస్తున్నందున వారిద్వారా జిల్లాలలో మళ్ళీ కరోనా వ్యాపించకుండా రాష్ట్ర ప్రభుత్వం నివారిస్తోంది. బుదవారం జియాగూడాకు చెందిన ఒక 38 ఏళ్ళ మహిళ, సరూర్‌నగర్‌కు చెందిన 74 ఏళ్ళ వృద్ధుడు మరణించారు. వారిరువురికీ కరోనా ఉన్నట్లు నిర్ధారణ అవడంతో కరోనా మృతుల సంఖ్య 34కి చేరింది.    

 రాష్ట్రంలో వరంగల్‌ రూరల్, యాదాద్రి భువనగిరి, వనపర్తి జిల్లాలలో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. 

గత 14 రోజులలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కానీ జిల్లాలు: కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, మెదక్, జయశంకర్ భూపాలపల్లి, సంగారెడ్డి, నాగర్ కర్నూల్‌, ములుగు, పెద్దపల్లి, సిద్ధిపేట, మహబూబాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్‌, నల్గొండ, ఆసిఫాబాద్‌, ఖమ్మం, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, సూర్యాపేట, నారాయణ్ పేట, వరంగల్‌ అర్బన్, జనగావ్, గద్వాల్, నిర్మల్ జిల్లాలు. 


Related Post