తమిళనాడు తరువాత ఏపీ

May 12, 2020


img

దక్షిణాది రాష్ట్రాలలో మొదట తెలంగాణలోనే ఎక్కువగా కరోనా కేసులు నమోదయ్యాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పలు చర్యలతో రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గాయి. పొరుగురాష్ట్రాలైన ఆంధ్రా, తమిళనాడు రాష్ట్రాలలో మాత్రం శరవేగంగా కరోనా కేసులు నానాటికీ పెరిగిపోతున్నాయి. 

తమిళనాడులో కోయంబెడ్ మార్కెట్ నుంచి ఆ రాష్ట్రమంతటా కరోనా వైరస్‌ వ్యాపించడంతో ఇప్పుడు రోజుకు 600-700 కొత్త కేసులు నమోదవుతున్నాయి. నేటి వరకు తమిళనాడులో 8,002 కేసులు నమోదు కాగా వారిలో 5,898 మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 2,051 మంది కోలుకొన్నారు...53 మంది కరోనాతో మరణించారు. 

తమిళనాడు తరువాత స్థానంలో ఏపీ చేరుకొంది. ఏపీలో రోజుకు 30-60 కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటలలో 10,730 మందికి పరీక్షలు నిర్వహించగా వారిలో 33 మందికి పాజిటివ్ అని తేలింది. దాంతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 2,051కి చేరింది. అయితే కొలుకొంటున్నవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉండటం చాలా ఉపశమనం కలిగిస్తోంది. ఇప్పటివరకు 1,056 మంది కోలుకొని ఇళ్లకు తిరిగివెళ్లారు. మంగళవారం కృష్ణా జిల్లాలో ఒకరు, కర్నూలు జిల్లాలో ఇద్దరు కరోనాతో మరణించారు. దాంతో ఏపీలో కరోనా మృతుల సంఖ్య 46కి చేరింది. 

ఏపీ, తమిళనాడు రాష్ట్రాలలో నానాటికీ కరోనా కేసులు పెరుగుతున్నందున ఒకవేళ రాష్ట్రాల మద్య మళ్ళీ ప్రజల రాకపోకలు మొదలైతే తెలంగాణలో కరోనా కేసులు పెరిగే ప్రమాదం ఉంటుంది. కనుక కరోనా ప్రభావిత రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి కరోనా ప్రవేశించకుండా అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వ్యూహాలను సిద్దం చేసుకోవలసి ఉంటుంది లేకుంటే ఇన్నాళ్ళు చేసిన శ్రమ, భరించిన కష్టాలు అన్నీ వృధా అయిపోతాయి. 


Related Post