కేసీఆర్‌-జగన్ దోస్తీ ముగిసినట్లేనా?

May 12, 2020


img

తెలంగాణ సిఎం కేసీఆర్‌, ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డిల మద్య దోస్తీ మూన్నాళ్ళ ముచ్చటేనా? అంటే అవుననే అనిపిస్తోంది. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 3 టీఎంసీలు నీళ్ళను ఎత్తిపోసుకొనేందుకుగాను ఏపీ ప్రభుత్వం ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి ఇటీవల జీవో జారీ చేసింది. దానిపై సిఎం కేసీఆర్‌ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. 

సోమవారం ప్రగతి భవన్‌లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో సిఎం కేసీఆర్‌ మాట్లాడుతూ, “ఉమ్మడి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని వినియోగించుకొనేందుకు ప్రాజెక్టు నిర్మించాలని ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకొంది. ఏపీలో ఈ ప్రాజెక్టు నిర్మిస్తే రాష్ట్రంలో ఉమ్మడి పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు సాగునీరు, త్రాగునీటికి తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా ఏపీ ప్రభుత్వం తీసుకొన్న ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. మనకి మాట మాత్రంగానైనా చెప్పకుండా, అపెక్స్ కమిటీ అనుమతి తీసుకోకుండా ఇటువంటి నిర్ణయం తీసుకోవడం చాలా తప్పు. ఇది రాష్ట్ర విభజన చట్టానికి ఇది వ్యతిరేకం. దీనిపై కృష్ణా నీటి యాజమాన్య నిర్వహణ బోర్డుకు ఫిర్యాదు చేసి, ఏపీ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును నిర్మించకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుదాము. గతంలో రెండు రాష్ట్రాలకు మద్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి రెండు రాష్ట్రాలలో రైతులకు మేలు కలిగేలా కృష్ణా, గోదావరి నదీ జలాలు వినియోగించుకొందామని నేనే ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డికి స్నేహహస్తం అందించాను. కానీ ఏపీ ప్రభుత్వం ఆ స్పూర్తికి భంగం కలిగించేలా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం చాలా బాధాకరం. తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగితే చూస్తూ ఊరుకొనేది లేదు. దీనిపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్‌కు వెళితే తీర్పు రావడానికి చాలా సమయం పడుతుంది. కనుక నేరుగా సుప్రీంకోర్టులోనే దీనిపై న్యాయపోరాటం చేద్దాము,” అని అన్నారు. 

దీనిపై ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.


Related Post