కేసీఆర్‌ సలహాను ప్రధాని మోడీ పట్టించుకొంటారా?

May 11, 2020


img

ఈరోజు మధ్యాహ్నం ప్రధాని నరేంద్రమోడీ ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధాని మోడీకి పలు సూచనలు, అభ్యర్ధనలు చేశారు. రేపటి నుంచి న్యూడిల్లీ-దేశంలో కొన్ని ప్రధాననగరాల మద్య 15 జతల రైళ్ళు నడిపించాలని రైల్వేశాఖ ప్రకటించిన నేపధ్యంలో, సిఎం కేసీఆర్‌ ఆ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం డిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్‌ వంటి ప్రధాన నగరాలలో కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నందున ఆ నగరాల మద్య రైళ్ళను నడిపించినట్లయితే దేశంలో కరోనా ఇంకా పెరిగిపోయే ప్రమాదం ఉందని కనుక మరికొన్ని రోజుల వరకు రైళ్ళు నడిపించవద్దని ప్రధాని నరేంద్రమోడీని కోరారు. లక్షల సంఖ్యలో ఉన్న వలస కార్మికులకు పరీక్షలు చేయడం, క్వారెంటైన్‌లో ఉంచడం రెండూ కష్టమే కనుక వారిని స్వరాష్ట్రాలకు తరలింపు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని అందుకు ఆయా రాష్ట్రాలు కూడా సహకరించేలా చేయాలని సూచించారు.  

లాక్‌డౌన్‌ కారణంగా ప్రస్తుతం అన్ని రాష్ట్రాల ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకొన్నందున అన్ని రాష్ట్రాల రుణాలను రీ-షెడ్యూల్ చేయాలని, కొత్త రుణాలను సేకరించుకొనేందుకు వీలుగా రాష్ట్రాల ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిని పెంచాలని సిఎం కేసీఆర్‌ కోరారు.

ఆరెంజ్, రెడ్‌జోన్‌లలో కరోనా కేసులు తగ్గినప్పుడు రాష్ట్రాలు కోరిన వెంటనే వాటిలో మార్పులు చేయాలని సిఎం కేసీఆర్‌ ప్రధాని నరేంద్రమోడీని కోరారు. ఆవిధంగా చేసినట్లయితే అన్ని రంగాలు మళ్ళీ పూర్తి స్థాయిలో పనిచేసుకొనేందుకు వీలవుతుందన్నారు. కరోనా మహమ్మారిని ఇప్పట్లో వదిలించుకొనే అవకాశం కనిపించడం లేదు కనుక తదనుగుణంగా ప్రజలను చైతన్యపరిచే విధంగా ప్రచారం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న న్యూడిల్లీ-ముంబై-చెన్నై-హైదరాబాద్‌ తదితర నగరాల మద్య రేపటి నుంచి రైళ్ళు నడిపించడానికి ఇప్పటికే రైల్వేశాఖ సిద్దమైంది కనుక కేసీఆర్‌ సూచనను కేంద్రం పట్టించుకొంటుందనుకోలేము. అయితే కరోనా వ్యాపించకుండా రైల్వే శాఖ అన్ని జాగ్రత్తలు తీసుకొంటోంది. కరోనా లక్షణాలు లేనివారిని ధర్మల్ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించిన తరువాతే ప్రయాణించేందుకు అనుమతిస్తోంది. అన్ని బోగీలు శానిటైజ్ చేసి, స్టేషన్లలోకి ప్రయాణికులను తప్ప మరెవరినీ అనుమతించడం లేదు. కనుక ఈ ప్రయోగం విజయవంతమైతే ఇక ముందు మరిన్ని రైళ్ళను నడిపించే అవకాశం ఉంటుంది తప్ప రేపటి నుంచి నడిపించబోయేవాటిని రద్దు చేయకపోవచ్చు.          


Related Post