సీతక్కను అడ్డుకొన్న పోలీసులు

May 11, 2020


img

ములుగు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్కను ఈరోజు ఉదయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ళ గ్రామంలో పేద ప్రజలకు నిత్యావసరసరుకులు అందజేసేందుకు వెళుతుండగా రేగళ్ళ చౌరస్తా వద్ద పోలీసులు ఆమెను అడ్డుకొని వెనక్కు తిప్పి పంపించేశారు. నిత్యావసర సరుకుల పంపిణీ సందర్భంగా భారీగా జనాలు పోగయ్యే ప్రమాదం ఉంటుంది కనుక ఆమెను అనుమతించలేమని లక్ష్మీదేవిపల్లి ఎస్ఐ ప్రవీణ్ కుమార్ చెప్పారు. అదీగాక ఏజన్సీ ఏరియా అయిన రేగళ్ళలో మావోయిస్టులు తిరుగుతున్నట్లు సమాచారం ఉన్నందున ఆమె భద్రత దృష్ట్యా కూడా రేగళ్ళ వెళ్ళేందుకు అనుమతించలేమని చెప్పడంతో ఎమ్మెల్యే సీతక్క నిరాశగా వెనుతిరిగారు.

లాక్‌డౌన్‌ కారణంగా పనులు లేకపోవడంతో మారుమూల గ్రామాలలో ఉన్న నిరుపేద ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, పసిపిల్లలు ఆకలితో అలమటిస్తుండటం చూసి కరిగిపోయిన ఎమ్మెల్యే సీతక్క గత నెలరోజులుగా జిల్లాలోని గ్రామాలలో పర్యటిస్తూ నిరుపేదలకు నిత్యావసర సరుకులు, ఆహారం అందజేస్తున్నారు. వాహనాలు కూడా వెళ్ళే అవకాశం లేని కొన్నిగ్రామాలకు సీతక్క స్వయంగా నెత్తిపై బియ్యం, నిత్యావసరకుల మూటలు పెట్టుకొని రాళ్ళు రప్పలలో మోసుకొని వెళ్ళి పేదలకు అందజేస్తున్నారు. స్వయంగా అందజేయడమే కాక “గో హంగర్ గో” పేరిట సాటి ఎమ్మెల్యేలకు సవాలు విసిరి వారు కూడా ఈ మహత్కార్యంలో పాలుపంచుకొనేలా ప్రేరణ కల్పిస్తున్నారు. ఇటువంటి మంచి కార్యక్రమానికి ప్రభుత్వం, పోలీసులు సహకరించి మరింతమందికి ప్రేరణ కల్పిస్తే బాగుండేది. కానీ ఆకలితో మాడుతున్న పేదప్రజలకు ఆహారం అందజేయాలని వెలుతున్న సీతక్కను అడ్డుకోవడం ఏమిటి?

అయినా హైదరాబాద్‌ నగరంలో, చిన్నా పెద్ద పట్టణాలలో రోజూ అనేకమంది ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు పేదలకు ఆహారం అందజేస్తునప్పుడు లేని అభ్యంతరాలు మారుమూల పల్లెల్లో ఉండేవారికి సీతక్క అందజేయాలనుకొంటే అభ్యంతరం ఎందుకో?



Related Post