విశాఖ గ్యాస్ లీక్ మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ కోటి పరిహారం

May 11, 2020


img

విశాఖపట్నంలోని స్టైరిన్ గ్యాస్ లీక్‌ కారణంగా 12 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. వారిలో 8 మందికి చెందిన వారసులను ప్రభుత్వం గుర్తించింది. ఏపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్, ధర్మాన కృష్ణదాస్ తదితరులు స్వయంగా ఈరోజు భాదితుల కుటుంబాల ఇళ్లకు వెళ్ళి పరామర్శించి, వారందరికీ ఒక్కొక్కరికీ కోటి రూపాయలు చొప్పున నష్టపరిహారం (చెక్కులు) అందజేశారు. కోటి రూపాయల చెక్కులతో పాటు బాధితులకు సానుభూతి తెలుపుతూ ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి సంతకం చేసిన లేఖలను కూడా అందజేశారు. 

మిగిలిన నలుగురి వారసులను కూడా గుర్తించి వారికి కూడా కోటి రూపాయలు నష్టపరిహారం అందజేస్తామని మంత్రులు చెప్పారు. అలాగే ఎల్జీ పాలిమర్స్ నుంచి వెలువడిన విషవాయువుతో ప్రభావితమైన 5 గ్రామాలలో ప్రజలందరికీ ఒక్కొక్కరికీ రూ.10,000 చొప్పున నష్టపరిహారం అందజేస్తామని తెలిపారు. గ్రామ వాలంటీర్లు స్వయంగా వారి ఇళ్ళవద్దకే వచ్చి చెక్కులు అందజేస్తారని తెలిపారు. 

ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో నిలువ ఉన్న స్టైరిన్ గ్యాస్ మొత్తం ట్యాంకర్లలో నింపి దక్షిణ కొరియాకు తిప్పి పంపిస్తున్నామని మంత్రులు తెలిపారు. ఈ ప్రమాదానికి కారణమైన ఎల్జీ పాలిమర్స్ కంపెనీపై చట్టప్రకారం అన్ని చర్యలు తీసుకొంటామని చెప్పారు. రాష్ట్రంలో ఇటువంటి ప్రమాదకరమైన పరిశ్రమలను జనావసాలకు దూరంగా తరలించి భవిష్యత్‌లో మళ్ళీ ఎన్నడూ ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొంటామని మంత్రులు తెలిపారు. 


Related Post