వారు భారత్‌ను కాపాడగలరా?

May 11, 2020


img

భారత్‌లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఆదివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 4,200 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో ఒకే రోజున ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. దీంతో భారత్‌ కరోనా కేసుల సంఖ్య  67,152కి చేరింది. వారిలో 20,197 మంది కోలుకోగా మరో 44,029 మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు దేశంలో 2,206 మంది కరోనాతో మృతి చెందారు. 

ఇటువంటి సమయంలో కరోనా ప్రభావిత దేశాల నుంచి 14,800 మంది ప్రవాస భారతీయులను 64 విమానాలు, మూడు యుద్ధనౌకాలలో భారత్‌కు తీసుకువస్తున్నారు. వలస కార్మికులను వారి స్వరాష్ట్రాలకు తరలిస్తున్నారు. చాలా రాష్ట్రాలలో మద్యం దుకాణాలు తెరిచేశారు. అన్ని రాష్ట్రాలలో లాక్‌డౌన్‌ ఆంక్షలు కూడా క్రమంగా సడలిస్తున్నారు. ఇవన్నీ కరోనా వైరస్ వ్యాప్తికి మరింత దోహదపడేవేనని చెప్పక తప్పదు. తెలంగాణలో ఆదివారం బయటపడిన కరోనా కేసులలో ఏడుగురు వలస కార్మికులవే కావడం గమనిస్తే వారి తరలింపుతో కరోనా వ్యాపించే ప్రమాదం ఉందని స్పష్టమవుతోంది. 

దేశంలో కరోనా మహమ్మారి ప్రవేశించినప్పటి నుంచి వైద్యులు, వైద్య సిబ్బంది అవిశ్రాంతంగా పోరాడుతూనే ఉన్నారు. కానీ వారు ఒక దశ వరకు మాత్రమే పోరాడగలరు. కనుక ఇకపై కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాప్తిని అరికట్టవలసి ఉంటుంది. లేకుంటే మున్ముందు పెరిగిపోయే కేసులకు వైద్య చికిత్స అందించేందుకు మరిన్ని ఏర్పాట్లు, అలాగే కరోనా కారణంగా జరుగబోయే ఆర్ధిక, సామాజిక నష్టాలను సమస్యలను ఎదుర్కొనేందుకు అవసరమైన శక్తి సామర్ధ్యాలు పెంపొందించుకోవలసి ఉంటుంది. ఇది మన పాలకులు, ఉన్నతాధికారుల సామర్ధ్యానికి సవాలు వంటిదే. ఈ క్లిష్ట సమయంలో వారు భారత్‌ను కరోనా మహమ్మారి నుంచి కాపాడుకొంటూ ఆర్ధిక సమస్యలను అధిగమిస్తారా లేదా? అనే విషయం మరొక ఆరు నెలలలో తేలిపోతుంది.


Related Post