టి-కాంగ్రెస్‌ డిమాండ్స్ బాగానే ఉన్నాయి కానీ ..

May 09, 2020


img

ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ కుమార్ శనివారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “విదేశాలలో ఉన్న ప్రవాస భారతీయులను స్వదేశానికి తీసుకురావడాన్ని స్వాగతిస్తున్నాము కానీ వారి దగ్గర ఛార్జీలు వసూలు చేయడం సరికాదు. గల్ఫ్ దేశాలలో లక్షలాదిమంది తెలంగాణ కార్మికులు పనిచేస్తున్నారు. ఇప్పటివరకు వారందరూ కోట్లాదిరూపాయలు (విదేశీ మారకం) రాష్ట్రానికి పంపించేవారు. కానీ కరోనా కారణంగా వారి పరిస్థితులు ఇప్పుడు తలక్రిందులయ్యాయి. కనుక వారినందరినీ కూడా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఉచితంగా రాష్ట్రానికి తిరిగి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నాను. సిఎం కేసీఆర్‌ కేంద్రప్రభుత్వంతో మాట్లాడి వారిని స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేయాలని కోరుతున్నాను. వారిని రాష్ట్రానికి తిరిగి రప్పించడమే కాకుండా వారు గౌరవప్రదంగా జీవనం సాగించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నాను. దశాబ్ధాలుగా గల్ఫ్ కార్మికులు మన ఆర్ధికవ్యవస్థకు ఎంతో తోడ్పడ్డారు. కనుక ప్రత్యుపకారంగా ఇప్పుడు వారినందరినీ స్వదేశానికి తిరిగి తీసుకురావాలని కోరుతున్నాను,” అని అన్నారు.

సౌదీ అరేబియాలో 5,53,163 మంది, యూఏఈలో 4,76,000 మంది, కువైట్‌లో 1,56,054 మంది, ఓమన్‌లో 1,33,116 మంది, ఖతార్‌లో 1,18,490 మంది, బహ్రెయిన్ దేశంలో 53,196 మంది కలిపి మొత్తం 14,90,019 మంది తెలంగాణ కార్మికులు పనిచేస్తున్నట్లు అధికారిక గణాంకాలే చెపుతున్నాయి. వారు కాక మిగిలిన రాష్ట్రాలకు చెందినవారు 87,64,829 మంది గల్ఫ్ దేశాలలో పనిచేస్తున్నారు. అంటే 1,02,54,848 మంది  భారతీయులు గల్ఫ్ దేశాలలో పనిచేస్తున్నారన్న మాట! 

కరోనా.. లాక్‌డౌన్‌ కారణంగా మన దేశంలో వివిద రాష్ట్రాలలో పనిచేస్తునవారే నానా కష్టాలు అనుభవిస్తుండటం అందరం కళ్ళారా చూస్తున్నాము. అటువంటిది ఆ పరాయిదేశాలలో సుమారు కోటి మందికిపైగా భారతీయులు ఎన్ని కష్టాలు పడుతున్నారో...ఎటువంటి పరిస్థితులలో ఉన్నారో ఊహించుకోవడం కూడా కష్టమే. కానీ కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కలిసినా కూడా కోటిలో సగం మందిని తరలించడం కూడా చాలా కష్టమే. వారినందరినీ స్వదేశానికి తరలించాలంటే కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే చేయలేవు. కాంగ్రెస్ పార్టీతో సహా దేశంలో అన్ని పార్టీలు, కార్పొరేట్ సంస్థలు, పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు తలో చెయ్యి వేస్తే ఇది సాధ్యమే. వలస కార్మికుల తరలింపుకు అయ్యే ఖర్చులను భరించడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ కార్మికులను కూడా వెనక్కు తీసుకురావడానికి చొరవ తీసుకొంటే బాగుంటుంది కదా?


Related Post