భారత్‌ మరో లాక్‌డౌన్‌ భరించగలదా?

May 09, 2020


img

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే ఉద్దేశ్యంతో మార్చి 24 నుంచి ఏప్రిల్ 13వరకు దేశంలో మొదటిసారిగా లాక్‌డౌన్‌ విధించింది కేంద్రప్రభుత్వం. ఆ తరువాత మళ్ళీ ఏప్రిల్ 14 నుంచి మే3వరకు లాక్‌డౌన్‌ పొడిగించింది. మళ్ళీ మే 4 నుంచి మే 17వరకు లాక్‌డౌన్‌ పొడిగించింది. లాక్‌డౌన్‌తో కరోనాను కొంతవరకు కట్టడి చేసిన మాట వాస్తవం. అయితే అదే లాక్‌డౌన్‌తో దేశ ఆర్ధికవ్యవస్థ చితికిపోతోంది. లక్షలాదిమంది ఉద్యోగాలు, ఉపాది ఆదాయం కోల్పోయారు. కోట్లాది మంది పేదప్రజలు రోడ్డున పడ్డారు. 

గల్లీలో దుకాణాలు, టిఫిన్ సెంటర్లు మొదలు నగరాలలోని షాపింగ్ మాల్స్, స్టార్ హోటల్స్ వరకు, చిన్న వర్క్ షాపులు మొదలు భారీ పరిశ్రమల వరకు అన్నీ తీవ్రంగా నష్టపోతున్నాయి. ఒకప్పుడు పెద్ద నోట్ల రద్దు వలన జరిగిన నష్టం, ఎదురైన కష్టాల కంటే ఈ లాక్‌డౌన్‌ వలననే ఎక్కువగా ఉన్నాయని చెప్పకతప్పదు. కనుక దేశం మరోసారి లాక్‌డౌన్‌ భరించే శక్తి లేదనే చెప్పవచ్చు.

ఒకవేళ మరోసారి లాక్‌డౌన్‌ పొడిగించినట్లయితే కేంద్రప్రభుత్వం దేశంలో కోట్లాదిమంది పేదప్రజలకు భారీగా ఆర్ధికసాయం ప్రకటించవలసి ఉంటుంది. పేద ప్రజలకే కాక, లాక్‌డౌన్‌తో తీవ్రంగా నష్టపోయిన దేశంలోని అన్ని రంగాలకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించవలసి ఉంటుంది. కానీ కేంద్రప్రభుత్వానికి అంత ఆర్ధికశక్తి లేదు కనుక ఉద్దీపన పధకాలు ప్రకటించడం కూడా కష్టమే. కనుక ఇదే చివరి లాక్‌డౌన్‌ కావచ్చు. అయితే లాక్‌డౌన్‌ పూర్తిగా లేదా పాక్షికంగా ఎత్తివేసినా కరోనా వ్యాప్తిని సాద్యమైనంత తగ్గించేందుకు ఎప్పటికప్పుడు కొత్త నిబందనలు, ఆంక్షలు విధిస్తూనే ఉండవచ్చు. 

భారత్‌ పరిస్థితి ఇప్పుడు కురుక్షేత్రంలో కర్ణుడిలా ఉందని చెప్పవచ్చు. ఒకపక్క భూమిలో కూరుకుపోయిన రధచక్రాన్ని బయటకు లాగేందుకు ప్రయత్నిస్తూనే, మరోపక్క బాణాలతో దాడి చేస్తున్న అర్జునుడిని ఎదుర్కోవలసివచ్చినట్లు, ఒకపక్క కరోనా మహమ్మారితో పోరాడుతూనే, దిగబడిపోయిన ఆర్ధిక రధచక్రాలను బయటకు లాగి పరుగులెత్తించక తప్పదు.


Related Post