భారత్‌లో కరోనా డేంజర్ బెల్స్

May 09, 2020


img

భారత్‌లో లాక్‌డౌన్‌ చివరి దశకు చేరుకొనే సమయానికి కరోనా నియంత్రణలోకి రాకపోగా శరవేగంగా పెరుగుతుండటం చాలా ఆందోళనకలిగిస్తోంది. రోజుకు సగటున 3,000 కొత్త కేసులు చొప్పున వారానికి 21,000 మంది కరోనా బారిన పడుతున్నారు. ఈ లెక్కన మే 17న లాక్‌డౌన్‌ ముగిసేనాటికి అంటే...మరో 8 రోజులలో దేశంలో కరోనా కేసుల సంఖ్య లక్షకు చేరుకొనే అవకాశం ఉంది. 

మహారాష్ట్ర (19,603), గుజరాత్‌ (7,403), డిల్లీ (6,318), తమిళనాడు (6,009), రాజస్థాన్ (3,636) మధ్యప్రదేశ్ (3,341) రాష్ట్రాలలో కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నందునే జాతీయస్థాయిలో కూడా పెరుగుతోందని చెప్పక తప్పదు. ఈశాన్య రాష్ట్రాలలో ఒక్క త్రిపురలో తప్ప మిగిలిన రాష్ట్రాలలో కరోనా ప్రభావం లేదనే చెప్పాలి. గోవా, బీహార్, ఛత్తీస్‌ఘడ్‌, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఝార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలలో, అలాగే దక్షిణాదిన ఆంధ్రా, తెలంగాణ, కేరళ, కర్ణాటక రాష్ట్రాలలో కరోనా నియంత్రణలోనే ఉందని చెప్పవచ్చు. 

కనుక శరవేగంగా కరోనా కేసులు పెరుగుతున్న ఆ 5 రాష్ట్రాలు, దేశరాజధాని డిల్లీలోను కరోనాను నియంత్రించగలిగితేనే దేశంలో కరోనా అదుపులోకి వస్తుంది. అందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని అమలుచేయవలసి ఉంటుంది లేకుంటే లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తరువాత ఆ 5 రాష్ట్రాలు, డిల్లీ నుంచి మళ్ళీ కరోనా దేశంలో అన్ని రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంది. మళ్ళీ కరోనా కధ మొదటికొస్తుంది.    

కేంద్ర కుటుంబ ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ చెప్పిన తాజా వివరాల ప్రకారం శనివారంనాటికి దేశంలో 59,662 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 17,847 మంది కోలుకొని ఇళ్లకు తిరిగివెళ్ళగా మరో 39,834 మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 1,981 మంది కరోనాతో మృతి చెందారు.


Related Post