ఈ ఓటమి తాత్కాలికమే!

May 09, 2020


img

కరోనా వైరస్ వ్యాపించిన కొత్తలో దాని గురించి పూర్తి అవగాహన లేకపోవడం వలన ప్రపంచదేశాలన్నీ తక్కువగా అంచనా వేశాయి. గతంలో పుట్టిన ఇతర వైరస్‌లలాగే కరోనాను కూడా సులువుగా కట్టడి చేయొచ్చనుకొన్నారు. అందుకే “మాస్కూలు ధరించక్కరలేదు... జ్వరం మాత్ర వేసుకొంటే తగ్గిపోతుంది.. లాక్‌డౌన్‌తో కరోనా గొలుసు తెంచి పూర్తిగా నిర్మూలించవచ్చు...” అని భ్రమించారు. కానీ కరోనా మహమ్మారి ఆ భ్రమలన్నిటినీ తుడిచిపెట్టేసింది. ఏమి చేసినా...ఎంత చేసినా కరోనాను కాస్త కట్టడి చేయగలమే తప్ప పూర్తిగా నివారించలేమని 46 రోజుల లాక్‌డౌన్‌ తరువాత స్పష్టం అయ్యింది. ఈ విషయం ఇప్పుడు అందరికీ అర్ధం అవడంతో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు..మొదలు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ వరకు అందరూ “కరోనాతో కలిసి జీవించడం నేర్చుకోవాలి...” అంటూ కొత్త పాట పాడుతున్నారు. అది వాస్తవం కూడా. 

 “నిజానికి కరోనా పెద్ద జబ్బేమీ కాదు. ఇకపై అది సాధారణ జ్వరం, జలుబులాగే తరచూ వచ్చి పోతుంటుంది... కొన్నిసార్లు అది ఎప్పుడు వచ్చిందో... ఎప్పుడు పోయిందో కూడా తెలియకపోవచ్చు. మాత్రలు వేసుకొంటే తగ్గిపోవచ్చు. పూర్తి ఆరోగ్యంగా ఉండి రోగనిరోధక శక్తి బలంగా ఉన్నవారికి ఆ అవసరం కూడా ఉండకపోవచ్చు. సామాజిక దూరం... మాస్కూలు ధరించడం...వ్యక్తిగత శుభ్రత వంటివి పాటిస్తే సరిపోతుంది,” అని వారం రోజుల క్రితమే ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి తేల్చి చెప్పేశారు. ఆ తరువాత తెలంగాణ సిఎం కేసీఆర్‌, అంతకు ముందు డోనాల్డ్ ట్రంప్‌ వంటివారు కూడా కాస్త అటూ ఇటూగా అదే మాట చెప్పేరు. కరోనా గురించి మొదట్లో చెప్పుకొన్న మాటలే 46 రోజుల లాక్‌డౌన్‌ తరువాత మళ్ళీ చెప్పుకోవడం విశేషం. 

తాజాగా కేంద్ర కుటుంబ ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ కూడా నిన్న ఇదే చెప్పారు. డిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “మనం ఇప్పుడు కరోనాతో కలిసి జీవించడం నేర్చుకోవాలి. అందుకోసం జారీ చేసిన మార్గదర్శకాలను అందరూ తూచా తప్పకుండా పాటించాలి. ఈ మార్గదర్శకాలను ప్రజలందరూ తమ జీవితాలలో భాగంగా చేసుకోవాలి. కరోనా వైరస్‌ నివారణకు మందులు కనుగొనేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాము. అంతవరకు జాగ్రత్తలు పాటిస్తూ కరోనాతో కలిసి జీవించక తప్పదు,” అని అన్నారు. 

కరోనాను జయించలేని నిసహాయత ఆ మాటలలో కనబడుతోంది. అయితే ఇది ఒక్క భారత్‌ సమస్యే కాదు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ మొదలు అందరూ కరోనా విషయంలో చేతులెత్తేయడం చూస్తూనే ఉన్నాము. ఒకపక్క కరోనాకు అడ్డుకట్ట వేయలేకపోవడం...మరోపక్క లాక్‌డౌన్‌ కారణంగా దేశాల ఆర్ధిక వ్యవస్థలు కుదేలైపోతుండటంతో ఏర్పడిన నిసహాయత అదని చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితులలో కరోనాతో పోరాటం కొనసాగించడమా... లేక ఆర్ధికవ్యవస్థ కుప్పకూలిపోకుండా కాపాడుకోవడం ముఖ్యమా? అని ఆలోచించక తప్పని పరిస్థితి ఏర్పడింది. 

కరోనాను అడ్డుకోలేమని స్పష్టమైపోయింది కనుక కనీసం ఆర్ధికవ్యవస్థను కాపాడుకోవాలని భావించడం సహజం. అందుకే మెల్లగా ఒక్కో దేశం... ఒక్కో ప్రభుత్వం... కరోనాతో కలిసి జీవిస్తూ పనులు చేసుకోక తప్పదని చెపుతున్నాయనుకోవచ్చు. 

అయితే ఇది తాత్కాలిక ఓటమే తప్ప శాశ్విత ఓటమి కాదని అందరికీ తెలుసు. మరొక 6-12 నెలలలోగానే కరోనాకు మందు తప్పక అందుబాటులోకి వస్తుంది. దాంతో కరోనా నుంచి ప్రపంచదేశాలు విముక్తి పొంది మళ్ళీ పూర్వ వైభవం సాధించడం ఖాయం. కాకపోతే అంతవరకు ప్రజలు... ప్రభుత్వాలు ఎంత మూల్యం చెల్లించాలో ఎవరూ చెప్పలేము.


Related Post