కరోనా పరీక్షలపై ఆరోపణలు...ఈటల వివరణ

May 08, 2020


img

తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే రాష్ట్రంలో కరోనా పరీక్షలు చేయడం తగ్గించి, కరోనా కేసులు తగ్గిపోయాయని ప్రజలను, కేంద్రప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తోందని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తుంటే, ముస్లిం ఓటు బ్యాంకు దృష్టిలో ఉంచుకొని ఓవైసీలను ప్రసన్నం చేసుకొనేందుకే కరోనా పరీక్షలు చేయడం తగ్గించివేసిందని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. 

ఈ ఆరోపణలపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పందిస్తూ, “కరోనా పరీక్షలు చేయడంలేదనేది అవాస్తవం. కేంద్రప్రభుత్వం, ఐసీఎంఆర్ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారమే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నాము. ఇదివరకు రోజుకు 80-90 కేసులు వస్తే 800-900 మందికి పరీక్షలు చేయవలసి వచ్చేది కానీ ఇప్పుడు రోజుకు 8-9 కేసులే వస్తున్నందున అన్ని పరీక్షలు చేయవలసిన అవసరం లేదు. ఇదే విషయం కేంద్రప్రభుత్వానికి తెలియజేశాము. కరోనా విషయంలో దాచిపుచ్చడానికి ఏమీ లేదు. 

గడిచిన 24 గంటలలో కొత్తగా 10 కేసులు నమోదయ్యాయి. వాటితో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,132 అయ్యింది. ఇప్పటి వరకు 722 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా మరో 376 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 29 మంది కరోనాతో మృతి చెందారు. 

రాష్ట్రంలో మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి, నల్గొండ, వికారాబాద్, ఆసిఫాబాద్, మహబూబ్‌నగర్‌, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్‌, జగిత్యాల, జనగామ జిల్లాలలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. కనుక వాటిని గ్రీన్‌ జోన్‌గా ప్రకటించాలని కేంద్రప్రభుత్వాన్ని కోరాము. 

రెడ్‌ జోన్‌గా ప్రకటించబడిన సూర్యపేట, వరంగల్‌ అర్బన్, నిజామాబాద్‌ జిల్లాలలో కూడా కరోనా పూర్తి నియంత్రణలో ఉంది కనుక వాటిని ఆరెంజ్‌ జోన్‌లోకి మార్చాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశాము. వీటిపై కేంద్రప్రభుత్వం సోమవారం ప్రకటనా చేసే అవకాశం ఉంది. 

ఈ 14 జిల్లాలను గ్రీన్‌ జోన్‌లోకి మారిస్తే రాష్ట్రంలో 80 శాతం కరోనా నుంచి విముక్తి పొందినట్లవుతుంది కనుక మళ్ళీ పనులు ప్రారంభించుకోవచ్చు. రాష్ట్రంలో హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్ మాత్రమే  మాత్రమే రెడ్‌ జోన్‌లో మిగిలి ఉన్నాయి కనుక ఇకపై వాటినీ కరోనా నుంచి విముక్తి చేసేందుకు మరింత గట్టిగా కృషి చేస్తాము,” అని చెప్పారు.


Related Post