కరోనా.. ముందుంది ముసళ్ళ పండగ?

May 07, 2020


img

లాక్‌డౌన్‌ వలననే దేశంలో కరోనా వైరస్ నియంత్రణలో ఉందని చెప్పుకోవచ్చు. లాక్‌డౌన్‌లో ఉన్నప్పటికీ కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే కరోనాతో లాక్‌డౌన్‌ను పూర్తిగా అరికట్టలేమని 44 రోజుల లాక్‌డౌన్‌ అనుభవంతో అందరూ అంగీకరిస్తున్నారు కనుక దేశంలో ఇదే చివరి లాక్‌డౌన్‌ కావచ్చునని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

అయితే లాక్‌డౌన్‌ పాక్షికంగా ఎత్తివేసినా దేశంలో కరోనా కేసుల సంఖ్య రెట్టింపు వేగంతో పెరిగే అవకాశాలున్నాయని భావించవచ్చు. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా కూడా అదే చెపుతున్నారు. 

డిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ప్రస్తుతం కరోనా కేసుల పెరుగుదల కాస్త నిలకడగానే ఉన్నప్పటికీ జూన్, జూలై నెలలో కరోనా కేసులు గణనీయంగా పెరిగిపోవచ్చు. గత 44 రోజులుగా దేశంలో కరోనా నమోదు అవుతున్న కరోనా కేసుల ఆధారంగా ఈ అంచనా వేస్తున్నాను. ఆ సమయానికి దేశంలో లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తివేయవచ్చు కనుక కరోనా కేసులు పెరిగే అవకాశం ఉంది. రాబోయే ఆరువారాలు చాలా కీలకమైనవని భావిస్తున్నాను. ఆలోగా మనం ఏమేరకు కరోనాను నియంత్రించామనేది చాలా ముఖ్యం. దాని ఆధారంగానే జూన్, జూలై నెలలలో కరోన తీవ్రతలో హెచ్చుతగ్గులుండే అవకాశం ఉంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు కరోనా భయం, ఆందోళన ఉంటుంది,” అని అన్నారు. అంటే క్లుప్తంగా చెప్పుకోవాలంటే ముందుంది ముసళ్ళ పండగని అనుకోవాలేమో?


Related Post