సంక్షోభంలో కూడా వ్యాపార అవకాశాలు సృష్టించుకొంటున్న జొమోటో

May 07, 2020


img

ఒక ఐడియా జీవితాన్నే మార్చివేస్తుందనే ప్రకటన టీవీలో ఎన్నోసార్లు చూసి ఉంటాము. అటువంటి ఐడియాతో పుట్టుకొచ్చినవే స్వీగ్గీ, జోమోటో వగైరా సంస్థలు. అతి తక్కువ కాలంలోనే దేశమంతటా వ్యాపించిన ఆ సంస్థలను గమనిస్తే ఆ ఐడియా ఎంత విజయవంతమయిందో అర్ధమవుతుంది. అయితే కరోనా... లాక్‌డౌన్‌ కారణంగా ఫుడ్ సప్లై చేయడానికి ఆ సంస్థలను ప్రభుత్వం అనుమతించకపోవడం, పైగా హోటల్స్ కూడా మూతపడటంతో ఆ సంస్థలు... వాటిలో పనిచేస్తున్న వేలాదిమంది సిబ్బంది తీవ్ర ఇబ్బంది పడ్డారు. 

‘అవసరం అమ్మ వంటిదని అది అన్నీ నేర్పిస్తుందని’ పెద్దలు అంటారు. ఇప్పుడూ అదే జరిగింది. లాక్‌డౌన్‌ చాలా మందికి కొత్త కష్టాలు తెస్తే ఈ సంక్షోభంలో ఆ సంస్థలు కొత్త ఆలోచనలు చేసి కొత్త వ్యాపార అవకాశాలను సృష్టించుకోగలిగాయి. 

జోమోటో తదితర ఫుడ్ సప్లై సంస్థలు లాక్‌డౌన్‌లో సరికొత్త అవతారం ఎత్తాయి. తమకున్న విస్తృతమైన నెట్‌వర్క్‌తో ఆహారానికి బదులు, ఇప్పుడు పళ్ళు, కూరగాయలు, బియ్యం, పప్పులు వగైరా నిత్యావసర సరుకులను తమ వినియోగదారులకు చేరవేస్తూ కొత్త వ్యాపారాలను ప్రారంభించాయి. 

తాజాగా మద్యం దుకాణాలు కూడా తెరుచుకోవడంతో, మద్యం కూడా డోర్ డెలివరీ చేసేందుకు జోమోటో సంస్థ సిద్దం అవుతోంది. మద్యం ఇళ్ళకు సరఫరా చేయకూడదనే నియమనిబందనలేవి లేవు కనుక ఇంటర్నేషనల్‌ స్పిరిట్స్‌ అండ్ వైన్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఐఎస్‌డబ్ల్యూఏఐ) చర్చలు జరుపుతున్నట్లు జోమోటో సీఈఓ మోహిత్ గుప్తా తెలిపారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ ప్రతిపాదనను ఆమోదిస్తే మందుబాబులు మద్యం దుకాణాల వద్ద గుమిగూడకుండా నివారించవచ్చు కనుక కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చు. కనుక ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర పడే అవకాశం ఉందనే భావించవచ్చు. ఇదివరకు హోటల్స్ నుంచి ఫుడ్ ప్యాకెట్స్ తీసుకొని వినియోగదారులకు అందజేసినట్లే ఇప్పుడు మద్యం దుకాణాల నుంచి మద్యం బాటిల్స్ తీసుకొని వినియోగదారులకు అందజేస్తానంటే కాదనేదెవరు? ఈ ప్రయోగం కూడా విజయవంతమైతే బహుశః లాక్‌డౌన్‌ ముగిసిన తరువాత కూడా అవి ఈ కొత్త వ్యాపారాలను కొనసాగించినా ఆశ్చర్యం లేదు.


Related Post