మరికొన్ని చావులు తప్పవు: ట్రంప్‌

May 06, 2020


img

ప్రపంచంలోకెల్లా అత్యధిక కరోనా కేసులు (12,34,351), అత్యధిక కరోనా మరణాలు (72,023)తో విలవిలలాడుతున్న దేశం అమెరికా. నేటికీ ప్రతీరోజు కొత్తగా వేల కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ప్రతీరోజు 1,500-2,000 మంది కరోనాతో  చనిపోతూనే ఉన్నారు. 

లాక్‌డౌన్‌ విధించినప్పటికీ ఈ పరిస్థితులలో మార్పు కనబడకపోవడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కూడా విసుగెత్తిపోయినట్లున్నారు. ఇంకా ఎంతకాలం లాక్‌డౌన్‌ చేసుకొని కూర్చోన్నా కరోనాను కట్టడి చేయడం సాధ్యం కాదు కానీ దేశఆర్ధికవ్యవస్థ కుప్పకూలిపోవడం ఖాయమని భావించిన ట్రంప్‌ దేశంలో లాక్‌డౌన్‌ ఆంక్షలను ఎత్తివేసేందుకు సిద్దమవుతున్నారు. 

అంతేకాదు.. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కొన్ని రోజుల క్రితం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్సును కూడా రద్దు చేయబోతున్నామని అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ తెలిపారు. దేశంలో కరోనా క్రమంగా అదుపులోకి వస్తోంది కనుక కరోనాను అరికట్టే బాధ్యతను సంబందిత శాఖలకు అప్పగించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని మైక్ పెన్స్ తెలిపారు. 

ట్రంప్‌ మంగళవారం వాషింగ్‌టన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “అమెరికా ఆర్ధికవ్యవస్థను గాడిలో పెట్టేందుకు లాక్‌డౌన్‌ ఎత్తివేయక తప్పదు. దాని వలన మరికొందరు ప్రజలు చనిపోయే అవకాశం ఉంది. కానీ దేశఆర్ధిక వ్యవస్థను కూడా కాపాడుకోవడం చాలా అవసరమే కనుక కరోనా మరణాలు తగ్గించేందుకు వీలైనన్ని ఎక్కువ జాగ్రత్తలు తీసుకొంటాము. గత రెండు నెలలలో కరోనాను ఏవిధంగా ఎదుర్కోవాలో నేర్చుకొన్నాము కనుక, అన్ని జాగ్రత్తలు..సామాజిక దూరం పాటిస్తూ అందరం కలిసికట్టుగా కరోనాను ఎదుర్కొంటూ ముందుకు సాగుదాము,” అని అన్నారు. 

రెండు నెలల కరోనా... లాక్‌డౌన్‌ కష్టాలు... ఆర్ధిక సమస్యలు చూసిన తరువాత ఇప్పుడు ట్రంప్‌ ఒక్కరే కాదు... ప్రపంచంలో చాలా దేశాలు ఇప్పుడు ఇంచుమించు ఇదేవిధంగా భావిస్తున్నాయి. కాకపోతే కొందరు ముందు...కొందరు తరువాత బయటపడుతున్నారు అంతే! కానీ కరోనా ఇంత తీవ్రంగా ఉన్నప్పుడు వ్యాక్సిన్ అందుబాటులోకి రాకమునుపే లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే కరోనా మహమ్మారి మళ్ళీ మరోసారి విజృంభించడం ఖాయం. అప్పుడు పరిస్థితులు ఇంకా దారుణంగా మారినా ఆశ్చర్యం లేదు.


Related Post