ఆ ప్రయత్నం చాలా ప్రమాదం: కేరళ సిఎం

May 06, 2020


img

విదేశాలలో చిక్కుకుపోయిన ప్రవాస భారతీయులను 64 ప్రత్యేక విమానాలు, 3 యుద్ధనౌకాలలో భారత్‌కు రప్పించాలనే కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోడీకి ఓ లేఖ కూడా వ్రాశారు. 

“ప్రస్తుత పరిస్థితులలో 13 దేశాల నుంచి 14,800 మంది భారతీయులను స్వదేశానికి తీసుకురావాలనే ప్రయత్నం మంచిది కాదు. దాని వలన ప్రయాణ సమయంలో వారికి కరోనా సోకే ప్రమాదం ఉంటుంది. వారి వలన దేశంలో మళ్ళీ కరోనా కేసులు పెరిగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ముఖ్యంగా కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న అమెరికా, బ్రిటన్ దేశాల నుంచి ప్రవాసభారతీయులను తీసుకురావాలనుకోవడం వారికీ... వారి వలన ఇక్కడి ప్రజలకు కూడా చాలా ప్రమాదం. కనుక ఈ తరలింపుకు బదులు అక్కడే వారిని సురక్షితంగా ఉంచేందుకు కేంద్రప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు ఆన్వేషిస్తే మంచిది,” అని లేఖలో వ్రాశారు. 

భారత్‌తో సహా ప్రపంచదేశాలన్నిటిలో విదేశాల నుంచి వచ్చినవారి ద్వారానే కరోనా మహమ్మారి ప్రవేశించిందని తెలిసిందే. అయితే అప్పటికి కరోనా గురించి ఎవరికీ సరైన అవగాహన లేకపోవడంతో ఆ మహమ్మారి అన్ని దేశాలను ఆక్రమించేసింది. కానీ ఇప్పుడు కరోనా లక్షణాలున్నవారిని గుర్తించి క్వారెంటైన్‌లో ఉంచడం ద్వారా కరోనా వ్యాపించకుండా నివారించగలుగుతున్నాము. కరోనా సోకినవారికి కూడా సకాలంలో చికిత్స అందిస్తే కొలుకొంటున్నారు కూడా. 

కనుక ఇప్పుడు విదేశాలలో పరీక్షించి కరోనా లక్షణాలు లేవని నిర్ధారించుకొని ప్రవాసభారతీయులను వెనక్కు తీసుకురావడం వలన కొత్తగా ప్రమాదం ఏమీ ఉండకపోవచ్చు. బహుశః అందుకే కేంద్రప్రభుత్వం ఇందుకు సిద్దపడి ఉండవచ్చు. అయితే వారిని స్వదేశాలకు తీసుకురావడం, అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించడం, 14 రోజులు క్వారెంటైన్‌లో ఉంచడం, కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినవారికి ఉచితంగా చికిత్స అందించడం వంటివన్నీ కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు అదనపు భారమేనని చెప్పవచ్చు.


Related Post