తెలంగాణలో మే 29వరకు లాక్‌డౌన్‌

May 06, 2020


img

తెలంగాణ రాష్ట్రంలో మే 29వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు సిఎం కేసీఆర్‌ నిన్న ప్రకటించారు. ప్రగతి భవన్‌లో నిన్న మధ్యాహ్నం మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై లోతుగా చర్చించి నిర్ణయాలు తీసుకొన్నారు. అనంతరం సిఎం కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి ఆ వివరాలను తెలియజేశారు. 

1. తెలంగాణలో మే 29వరకు లాక్‌డౌన్‌ పొడిగించబడింది.  

2. రాత్రి 7 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ యదాతధంగా అమలుచేయబడుతుంది. 

3. నేటి నుంచి రెడ్‌ జోన్లలో కంటెయిన్మెంట్ జోన్లలో ఉన్న 15 దుకాణాలు తప్ప మిగిలిన అన్ని ప్రాంతాలలో మద్యం దుకాణాలు తెరవబడతాయి. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచి ఉంటాయి. మాస్కూలు ధరించడం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి. లేకుంటే షాపులు సీజ్ చేయబడతాయి.  

4. పేదవారు తాగే చీప్ లిక్కర్ (మద్యం)పై 11 శాతం, మిగిలిన రకాలపై 16 శాతం ధరలు పెంచబడ్డాయి. 

5. పబ్బులు, క్లబ్బులు, బార్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్, ఫంక్షన్ హాల్స్, వ్యాయామశాలలకు లాక్‌డౌన్‌ ముగిసేవరకు తెరిచేందుకు అనుమతి లేదు.      

6. రెడ్‌ జోన్‌లో దుకాణాలు తెరిచేందుకు అనుమతిలేదు.  

7. గ్రీన్, ఆరెంజ్‌ జోన్‌ జోన్లలో మండల స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు అన్ని దుకాణాలు నిబందనలకు లోబడి తెరుచుకోవచ్చు. 

8. మునిసిపల్ పరిధిలో మాత్రం 50 శాతం దుకాణాలు మాత్రమే తెరిచేందుకు అనుమతించబడతాయి. 

9. గ్రీన్‌ జోన్లలో క్యాబ్‌లు, ఆటో రిక్షాలు నడిపించుకోవచ్చు. 

10. ఆరెంజ్‌ జోన్‌లో ఆటోలకు అనుమతి లేదు. క్యాబ్‌లు మాత్రమే నడిపించుకోవచ్చు. 

11. నేటి నుంచి రాష్ట్రంలో రిజిస్ట్రేషన్, ఆర్టీఓ కార్యాలయాలు పనిచేస్తాయి. 

12. నిబందలకు లోబడి గృహ నిర్మాణాలు చేసుకోవచ్చు. 

13. నేటి నుంచి ర్యాంపులలో ఇసుక తవ్వకాలు చేపట్టవచ్చు. 

14. హైకోర్టు అనుమతిస్తే అన్ని జాగ్రత్తలు తీసుకొని 10వ తరగతిలో మిగిలిన 8 పరీక్షలు త్వరలోనే నిర్వహిస్తాం. 

15. నేటి నుంచి ఇంటర్ పరీక్షాపత్రాలను దిద్దే కార్యక్రమం మొదలుపెడతాము.

16. ఈ విద్యాసంవత్సరం కాస్త ఆలస్యంగా జూన్ నెలాఖరు లేదా జూలై మొదటివారంలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. 

17. రైతు బంధు పధకం యధాతధంగా కొనసాగుతుంది. వానాకాలంలో కూడా రైతుబంధు పధకం కింద రూ.7,500 కోట్లు ఇస్తాం. 

18. రూ.25,000 లోపున్న పంట రుణాలను మాఫీ కోసం రూ. 1,198 కోట్లు విడుదల చేస్తూ బుదవారమే జీఓ జారీ చేస్తాం. ఒకటిరెండు రోజులలో ఆ సొమ్ము రైతుల ఖాతాలలో జమా అవుతుంది. దీని వలన రాష్ట్రంలో 5.50 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందుతారు. 

19. రూ.2,016 పింఛన్లు యధావిధిగా ఇస్తాం.  

20. రంజాన్ పండుగకు ఎటువంటి సడలింపులు ఉండవు. 

21. సామూహిక ప్రార్ధనలు, సమావేశాలు, రాజకీయ సభలపై నిషేదం కొనసాగుతుంది. 

22. పెళ్ళిళ్ళకు 20 మంది, చావులు, అంత్యక్రియలకు 10 మంది మాత్రమే అనుమతిస్తాం.      

23. ఇకపై విదేశాల నుంచి వచ్చేవారిని 14 రోజులపాటు హోటల్స్ లేదా లాడ్జీలలో ఉంచుతాము. వాటికి చార్జీలను వారే భరించాల్సి ఉంటుంది. 14 రోజులు క్వారెంటైన్‌ ఉన్న తరువాతే ఇళ్ళకు పంపిస్తాము. కనుక అందుకు సిద్దపడినవారే తెలంగాణకు రావచ్చు.    

24. మే 15వ తేదీన మళ్ళీ రాష్ట్రంలో పరిస్థితులను సమీక్షించి తదనుగుణంగా నిర్ణయాలు తీసుకొంటాము. అప్పటికి ఆరెంజ్‌ జోన్‌లో ఉన్న జిల్లాలు గ్రీన్‌ జోన్‌లోకి మారినట్లయితే ఆర్టీసీ బస్సులు తిప్పేందుకు కూడా అవకాశం ఉంది.


Related Post