నేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం

May 05, 2020


img

కేంద్రప్రభుత్వం ఈ నెల 17వరకు లాక్‌డౌన్‌ పొడిగించి, గ్రీన్, ఆరెంజ్, రెడ్‌ జోన్లవారీగా కొన్ని సడలింపులు ప్రకటించిన నేపధ్యంలో, నేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు సిఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో రాష్ట్రంలో కరోనా తాజా పరిస్థితులు, గ్రీన్, ఆరెంజ్‌ జోన్లలో లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపులు, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు, వ్యవసాయ రంగానికి సంబందించిన అంశాలపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రానికి ప్రధాన ఆదాయవనరుగా నిలుస్తున్న రాష్ట్రంలోని భవననిర్మాణ రంగం, పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలకు లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపులపై నేడు మంత్రివర్గ సమావేశంలో చర్చించబోతున్నట్లు సమాచారం. నేటికీ రోజూ కొత్త (కరోనా) కేసులు నమోదు అవుతూనే ఉన్నందున మే 21 లేదా నెలాఖరు వరకు లాక్‌డౌన్‌ పొడిగించవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  

పొరుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలలో మద్యం షాపులు తెరిచి విక్రయాలు ప్రారంభించినందున, తెలంగాణలో కూడా మద్యం దుకాణాలు తెరవక తప్పని పరిస్థితి ఏర్పడిందని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో మద్యం దుకాణాలు తెరవక పోతే రాష్ట్రంలో మందుబాబులు మద్యం కోసం కరోనా ఎక్కువగా ఉన్న పొరుగు రాష్ట్రాలకు వెళ్ళి కరోనా అంటించుకొనే ప్రమాదం ఉంటుంది లేదా ఆ రాష్ట్రాల నుంచి అక్రమంగా తెలంగాణలోకి మద్యం సరఫరా అయ్యే అవకాశం ఉంటుంది. కనుక ఈరోజు జరుగబోయే మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలో గ్రీన్, ఆరెంజ్‌ జోన్లలో మద్యం దుకాణాలు తెరిచే అంశంపై కూడా చర్చించి నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. కనుక మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోని మందుబాబులు ఈరోజు జరుగబోయే మంత్రివర్గ సమావేశం కోసం ఆత్రంగా ఎదురుచూసే పరిస్థితి ఏర్పడింది. 


Related Post