చైనాపై అమెరికా మరో తీవ్ర ఆరోపణ

May 04, 2020


img

చైనాలో వూహాన్‌లో డిసెంబరు నెలాఖరుకే కరోనా వైరస్ మొదలైనప్పటికీ చైనా ప్రభుత్వం సుమారు నెలరోజులకు పైగా దానికి సంబందించిన వివరాలను ప్రపంచ ఆరోగ్యసంస్థకు, ప్రపంచదేశాలకు తెలియకుండా దాచిపెట్టిందని అమెరికా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలు చేసింది అమెరికా కనుక దానికి కారణాలు కూడా అమెరికాయే చెప్పవలసి ఉంది కనుక  ఆ రహస్యమూ బయటపెట్టింది. 

వూహాన్‌లో కరోనా విజృంభించిన తరువాత దానిని కట్టడి చేసేందుకు సరిపడినన్ని మందులు, వైద్యసిబ్బంది ధరించే వ్యక్తిగత రక్షణ దుస్తులు విదేశాల నుంచి చైనా దిగుమతి చేసుకొందని, వాటి కోసమే కరోనా విషయం ప్రపంచ ఆరోగ్యసంస్థకు తెలియజేయకుండా దాచిపెట్టిందని అమెరికా ఆరోపించింది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో చైనా ఎగుమతులు, దిగుమతులను పరిశీలించినట్లయితే ఆ విషయం స్పష్టమవుతుందని అమెరికా వాదిస్తోంది. చైనా వాణిజ్య వైఖరికి పూర్తి భిన్నంగా ఆ రెండు నెలలలో ఎగుమతులు తగ్గి, దిగుమతులు పెరగడమే అందుకు నిదర్శనమని అమెరికా వాదిస్తోంది.  

కరోనా విషయం ముందుగానే ప్రపంచదేశాలకు తెలిపినట్లయితే మందులకు, వ్యక్తిగత రక్షణ దుస్తులకు హటాత్తుగా డిమాండ్ పెరిగి ధరలు పెరిగే అవకాశం ఉంటుంది కనుక, చైనా తన అవసరాలకు సరిపడినన్ని సమకూర్చుకొన్న తరువాతే కరోనా విషయం బయటపట్టిందని అమెరికా భావిస్తున్నట్లు అర్ధమవుతోంది. అమెరికా చేస్తున్న ఈ ఆరోపణే నిజమైతే, చైనా తన ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం చాలా స్వార్ధంగా వ్యవహరించిందని చెప్పకతప్పదు. ఈ ఆరోపణే నిజమైతే, చైనా చేసిన ఈ తప్పుకు ప్రపంచంలో 35 లక్షల మందికిపైగా కరోనా సోకింది...2,47,491 మంది మృత్యువాత పడ్డారు.


Related Post