ఇప్పుడు వలసకార్మికుల తరలింపు సరైనదేనా?

May 04, 2020


img

లాక్‌డౌన్‌ కారణంగా దేశవ్యాప్తంగా లక్షలాదిమంది వలస కార్మికులు పొరుగు రాష్ట్రాలలో చిక్కుకుపోయారు. లాక్‌డౌన్‌ ప్రకటించే ముందు, దానిని మళ్ళీ పొడిగిస్తున్నప్పుడు కేంద్రప్రభుత్వం వారి గురించి ఆలోచన చేయకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ తప్పును సరిదిద్దుకోవడానికి ఇప్పుడు వారిని రైళ్ళలో తరలించడం స్వరాష్ట్రాలకు మొదలుపెట్టింది. కానీ లాక్‌డౌన్‌ చివరిదశకు చేరుతున్న ఈ సమయంలో లక్షలాదిమందిని తరలించాలనుకోవడం  కూడా అనాలోచిత చర్యేనని చెప్పక తప్పదు.ఎందుకంటే అన్నీ లక్షల మందిని తరలించడానికి కొన్ని నెలలు పడుతుంది కనుక. 

పైగా ఇప్పుడు కేంద్రప్రభుత్వం స్వయంగా లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలిస్తుండటంతో త్వరలో అన్ని రంగాలు మళ్ళీ ప్రారంభం కాబోతున్నాయి. పనులు మొదలయ్యే సమయానికి వలస కార్మికులు లేకపోతే వారిపై ఆధారపడిన రంగాలు పనిచేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. 

ఉదాహరణకు ఒక్క హైదరాబాద్‌లోనే సుమారు 5 లక్షల మంది భవననిర్మాణ కార్మికులు పనిచేస్తున్నారు. వారందరూ తమ ఊళ్ళకు వెళ్లిపోతే, మళ్ళీ వారందరూ తిరిగివచ్చేందుకు ఎన్ని నెలలు పడుతుందో ఎవరూ ఊహించలేరు. అప్పటివరకు పనులు ఆపుకోవడం కష్టమే. అంతే నైపుణ్యం, సామర్ధ్యంతో ఉన్నవారు దొరకడం కూడా కష్టమే కనుక అన్ని రంగాలు స్తంభించిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే లాక్‌డౌన్‌తో నష్టపోయిన వివిద రంగాలు ఇప్పుడు కార్మికులు లేక పనులు నిలిపివేసుకోవలసివస్తే ఇంకా నష్టపోయీ మూసుకోవలసిన దుస్థితి ఏర్పడుతుంది. అందుకే మొదట్లో వలస కార్మికులను వారి స్వరాష్ట్రాలకు తరలించాలని కోరిన రాష్ట్రాలు సైతం ఇప్పుడు ఎక్కడివారిని అక్కడే ఉండనిచ్చి వారందరికీ తక్షణమే పని కల్పించేందుకు వీలుగా లాక్‌డౌన్‌ ఆంక్షలను సడలించాలని కోరుతున్నాయి. 

అయితే వలస కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను, వారి ఆందోళనలను, వారి భావోద్వేగాలను కూడా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకొనవలసి ఉంటుంది. వారిని స్వరాష్ట్రాలకు తరలించేబదులు వారి సమస్యలను పరిష్కరించి తక్షణం పనులు మొదలుపెట్టగలిగితే మరో ఉపద్రవం ఏర్పడకుండా నివారించవచ్చు.


Related Post