కరోనాతో కలిసి జీవించక తప్పదు: కేటీఆర్‌

May 04, 2020


img

కరోనా గురించి కొద్దిగా అవగాహన వచ్చిన తరువాత లాక్‌డౌన్‌ ద్వారా కరోనా గొలుసును తెంచి పూర్తిగా నిర్మూలించవచ్చని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు భావించాయి.కానీ నెలరోజులకు పైగా దేశంలో లాక్‌డౌన్‌ అమలుచేస్తున్నా  కరోనా కేసులు నియంత్రణలో ఉన్నాయే తప్ప నిలిచిపోలేదు. ఇన్ని రోజులు లాక్‌డౌన్‌తో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ఎలాగూ నష్టపోతూనే ఉన్నాయి...కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయం కోల్పోయి ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని దుస్థితికి చేరుకొంటున్నాయి. కనుక ఇప్పటివరకు లాక్‌డౌన్‌ కొనసాగించాలని గట్టిగా నొక్కి చెప్పిన రాష్ట్రాలు సైతం లాక్‌డౌన్‌ ఎత్తివేయాలని కోరుతున్నాయి. 

తెలంగాణ ఐ‌టి, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ, “ప్రజలు ప్రాణాలు ముఖ్యమా... జీవనోపాధి ముఖ్యమా?అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. రెండూ ముఖ్యమే కనుక కరోనాకు వ్యాక్సిన్ కనుగొనేవరకు కరోనాతో సహజీవనం చేయడం ఎలాగో అందరం నేర్చుకోకతప్పదు,” అని అన్నారు. 

ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇదే విషయం నాలుగు రోజుల క్రితమే చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కరోనాను పూర్తిగా నివారించలేకపోతోందని, కనుక కరోనాతో కలిసి బ్రతకక తప్పదని ప్రజలు గ్రహించాలని అన్నారు.    

దేశంలో మహారాష్ట్ర తరువాత అత్యధికంగా డిల్లీలో కరోనా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. కానీ డిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్‌ ఇక ఎంతమాత్రం లాక్‌డౌన్‌ కొనసాగించలేమని చెపుతున్నారు. ఆయన నిన్న మీడియాతో మాట్లాడుతూ, “లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం దారుణంగా పడిపోయింది. గత ఏడాది ఏప్రిల్ నెలలో రూ.3,500 కోట్లు ఉండగా అది ఈ ఏడాది రూ.300 కోట్లు పడిపోయింది. ఈ పరిస్థితులలో ప్రభుత్వాన్ని నడపడం చాలా కష్టంగా మారుతోంది. కనుక కరోనా వ్యాప్తికి దోహదపడేవాటిని తప్ప మిగిలిన రంగాలను మళ్ళీ పనిచేయించక తప్పదు,” అని అన్నారు. ఈ సందర్భంగా లాక్‌డౌన్‌ ఆంక్షల నుంచి ఐ‌టి, హార్డ్ వేర్, ఈ కామర్స్, ఫార్మా, ఫుడ్, తదితర రంగాలకు మినహాయింపులు ప్రకటించారు.   

మంత్రులు, ముఖ్యమంత్రుల చెపుతున్న ఈ మాటలు వాస్తవ పరిస్థితులను వివరిస్తున్నాయి. మే 17న లాక్‌డౌన్‌ ముగిసేలోగా దేశంలో మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లాక్‌డౌన్‌ ఎత్తివేయడానికే మొగ్గుచూపవచ్చు. కనుక దేశంలో     ఇదే చివరిదశ లాక్‌డౌన్‌ అని భావించవచ్చు. ఒకవేళ లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తివేసినా ప్రజలు ఇదివరకులా స్వేచ్ఛగా తిరగడం, పనిచేసుకోవడం సాధ్యం కాకపోవచ్చు. అలాగే బయటకు వెళితే కరోనా సోకే ప్రమాదం కూడా చాలా పెరుగుతుంది. అందుకు ప్రజలందరూ మానసికంగా సిద్దపడాల్సి ఉంటుంది. 


Related Post