కరోనా వారియర్స్ కు త్రివిధదళాలు అపూర్వ గౌరవం

May 04, 2020


img

తమ ప్రాణాలను పణంగా పెట్టి కరోనా మహమ్మారితో ప్రత్యక్షంగా పోరాడుతున్న కరోనా వారియర్స్...వైద్యులు, వైద్య సిబ్బందికి నిన్న అపూర్వ గౌరవం లభించింది. దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా భారత్ ఆర్మీ, నేవీ, వాయుసేనలు వారిని తమదైన శైలిలో గౌరవించాయి. 

భారత్‌ వాయుసేనకు చెందిన మూడు యుద్ధవిమానాలు కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా కరోనా రోగులకు చికిత్సలు చేస్తున్న ఆసుపత్రుల మీదుగా దూసుకువెళ్ళి గౌరవం ప్రకటించగా, వాయుసేన, నేవీకి చెందిన హెలికాఫ్టర్లు ఆదివారం ఉదయం 9.30 నుంచి 10.30 గంటలకు ఆ ఆసుపత్రులలో పనిచేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందిపై పూలవర్షం కురిపించాయి. 

రాష్ట్రంలో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రి వైద్యులు, వైద్య సిబ్బంది ఆసుపత్రి ఆవరణలో నిలబడి ఉండగా వారిపై చేతక్ హెలికాఫ్టర్‌లో నుంచి పూలవాన కురిపించింది. అంతేకాదు ఆర్మీ ఉన్నతాధికారులు స్వయంగా ఆసుపత్రులకు వచ్చి వైద్యులు, వైద్య సిబ్బందికి పూలగుచ్చాలు అందజేసి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. కరోనా వారియర్స్ గౌరవార్ధం నిన్న గోల్కొండ కోట ఆవరణలో ఆర్మీ బ్యాండ్ వాయించారు. దేశంలో పలు ప్రాంతాలలో ఆర్మీ, నేవీ, వాయుసేన అధికారులు, జవాన్లు ఆసుపత్రులకు వెళ్ళి వైద్యులు, వైద్య సిబ్బందిని కలిసి పూలగుచ్చాలు, జ్ఞాపికలు అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.


అదేవిధంగా హైదరాబాద్‌లో నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి, నీమ్స్, గచ్చిబౌలిలో కొత్తగా ఏర్పాటు చేసిన టిమ్స్ ఆసుపత్రులలో పనిచేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందికి కూడా ఇటువంటి అరుదైన గౌరవమే లభించింది. తమకు దక్కిన ఆ అపూర్వమైన గౌరవం చూసి వైద్యులు, వైద్య సిబ్బంది ఆనందంతో పొంగిపోయారు. ‘భారత్ మాతాకు జై’ అంటూ నినాదాలు చేస్తూ తమపై పూలవాన కురిపిస్తున్న వాయుసేన సిబ్బందికి సెల్యూట్ చేశారు. విశాఖతో సముద్రతీరంలో నిన్న సాయంత్రం భారత్‌ నేవీకి చెందిన యుద్ధనౌకలలో విద్యుద్దీపాలు వెలిగించి కరోనా వారియర్స్ కు కృతజ్ఞతలు తెలిపాయి. 

దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా త్రివిధదళాల నుంచి ఇటువంటి అపురూపమైన గౌరవం అందజేయడం ద్వారా వారి వెంట యావత్ దేశం…ప్రజలు ఉన్నారని వారి సేవలను అందరూ గుర్తిస్తున్నారని అని వారికి మరోసారి గుర్తుచేసినట్లయింది. దీని వలన వారిలో మళ్ళీ నూతనోత్సాహం కలుగుతుంది. 


Related Post