ఇడిగో కిమ్...బ్రతికే ఉన్నాడు!

May 02, 2020


img

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ గత 20 రోజులుగా ఎవరికీ కనబడకుండా హటాత్తుగా అదృశ్యమైపోవడంతో ఆయన తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని…కరోనా సోకి ఐసోలేషన్‌లో ఉన్నారని... కాదు.. బ్రెయిన్ డెడ్‌ అయ్యిందని...కాదు...చనిపోయారంటూ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. వాటన్నిటికీ సమాధానంగా కిమ్ జాంగ్ ఉన్ హటాత్తుగా నిన్న ప్రజల ముందు ప్రత్యక్షమయ్యారు. 

ఉత్తర కొరియా రాజధాని పోంగ్యాంగ్‌కు సమీపంలో గల సుంచోన్ అనే ప్రాంతంలో ఓ ఎరువుల తయారీ కర్మాగారానికి ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. తరువాత ఆ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులకు, ప్రజలకు ఆయన అభివాదం చేస్తున్న ఫోటోలు, వీడియోలు జాతీయ మీడియాలో వచ్చాయి. కిమ్ జాంగ్ ఉన్‌తో పాటు ఆయన చనిపోతే దేశాధ్యక్షపదవి చేపడతారని చెప్పబడిన ఆయన చెల్లెలు కిమ్ యో జాంగ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

కిమ్ జాంగ్ ఉన్‌ ఆరోగ్యం గురించి మీడియాలో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నప్పుడు ఉత్తర కొరియా ప్రభుత్వం వాటిని ఖండించనప్పటికీ, అమెరికా, దక్షిణ కొరియా ప్రభుత్వాలు వాటిని గట్టిగా ఖండించాయి. చివరికి అవి చెప్పిందే నిజమైంది. కిమ్ జాంగ్ ఉన్‌ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు స్పష్టం ఆవడంతో దేశంలో ఆయనను వ్యతిరేకించేవారు, శత్రుదేశాలు నిరాశ చెంది ఉండవచ్చు.     



Related Post