దేశంలో లాక్‌డౌన్ మరో రెండువారాలపాటు అంటే మే 17వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. అలాగే ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల ఆధారంగా దేశంలో రెడ్,ఆరెంజ్, గ్రీన్‌జోన్ జిల్లాలుగా విభజించింది. కరోనా కేసులు, తీవ్రత ఎక్కువగా ఉన్న 130 రెడ్‌జోన్ జిల్లాలలో లాక్‌డౌన్ ఆంక్షలు, రాత్రిపూట కర్ఫ్యూ యధాతధంగా కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, సూర్యాపేట, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజగిరి, వికారాబాద్, వరంగల్ అర్బన్ జిల్లాలు రెడ్ జోన్‌లో ఉన్నాయి. కనుక ఆ జిల్లాలో లాక్‌డౌన్ ఆంక్షలు యధాతధంగా అమలుచేస్తారు.
గత రెండు వారాలుగా కొత్తగా కరోనా కేసులు నమోదు కాని జిల్లాలు దేశంలో 284 ఉన్నాయి. వాటిని కేంద్రం ఆరెంజ్ జోన్‌లో చేర్చింది. ఆ జిల్లాలో పరిమిత ఆంక్షలతో లాక్‌డౌన్ సడలింపులు ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్, జోగులాంబ గద్వాల, నిర్మల్, నల్గొండ, ఆదిలాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, కొమరం భీం, ఆసిఫాబాద్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, మేదక్, జనగాం, నారాయణపేట జిల్లాలు ఆరెంజ్ జోన్‌లో ఉన్నాయి. వీటిలో ఓలా, ఊబర్ వంటి క్యాబ్ సర్వీసులను నడిపించుకోవచ్చు. కానీ ఒక కారులో డ్రైవరు కాకుండా మరో ఇద్దరు మాత్రమే ప్రయాణించవచ్చు. ద్విచక్రవాహనాలపై ఇద్దరు ప్రయాణించవచ్చు. ఇదివరకు ప్రకటించిన కొన్ని వ్యాపార సంస్థలు, చిన్న పరిశ్రమలకు కొన్ని ఆంక్షలతో కూడిన సడలింపులు ఉంటాయి. ఆరెంజ్ జోన్ సడలింపులపై ఇంకా స్పష్టత రావలసి ఉంది.
ఇప్పటివరకు ఒక్క కరోనాకేసు కూడా నమోదు కాని లేదా ఒక్క కేసు కూడా లేని 319 జిల్లాలు గ్రీన్‌జోన్‌లో ఉన్నాయి. వాటిలో లాక్‌డౌన్ ఆంక్షలు చాలా వరకు ఎత్తివేసింది. తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి, ములుగు, సిద్ధిపేట, వరంగల్ రూరల్, పెద్దపల్లి, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాలు గ్రీన్ జోన్‌లో ఉన్నాయి. ఈ జిల్లాలలో పరిధిలో మాత్రమే తిరిగేందుకు ఆర్టీసీ బస్సులు, అన్ని రకాల వాహనాలను అనుమతిస్తారు. అయితే బస్సులలో కూడా సామాజిక దూరం పాటించవలసి ఉంటుంది కనుక పరిమిత సంఖ్యలోనే ప్రయాణికులను అనుమతిస్తారు. మద్యం దుకాణాలు, పాన్ షాపులు వగైరా తెరుచుకోవచ్చు. ఈ జిల్లాలలో ప్రజలకు ఇకపై మరింత స్వేచ్చ లభిస్తుంది. అయితే మాస్కూలు ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు అన్నీ తప్పనిసరి.
గ్రీన్, ఆరెంజ్ జోన్ జిల్లాలకు ఈ కామర్స్ సంస్థలు మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్స్ తదితర వస్తువులను ఆన్‌లైన్ ద్వారా బుకింగ్స్, సరఫరా చేసుకోవచ్చు.
ఒకవేళ గ్రీన్ జోన్‌లో కరోనా కేసులు నమోదు అయితే వాటిని ఆరెంజ్ జోన్‌లోకి మారుస్తారు. అదే ఆరెంజ్ జోన్‌లో కేసులు నమోదైతే రెడ్ జోన్‌లోకి మారుస్తారు. కానీ ఒకసారి రెడ్, ఆరెంజ్ జోన్‌లలోకి వెళ్ళిన జిల్లాలలో మళ్ళీ కేసులు తగ్గినా, తమ అనుమతి లేకుండా వాటిని ఆరెంజ్, గ్రీన్ జోన్‌లలోకి మార్చరాదని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది.