ఇతర రాష్ట్రాలలో చిక్కుకొన్న వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించడంతో దేశవ్యాప్తంగా ఆ ప్రక్రియ మొదలైంది. కేంద్రప్రభుత్వం మార్చి 24న లాక్‌డౌన్ ప్రకటించక మునుపు లేదా వెంటనే ఈ పని చేసి ఉండి ఉంటే లక్షలాది కార్మికులు, వారి కుటుంబాలు ఆకలిదప్పులతో మాడుతూ పసి పిల్లలను వెంటబెట్టుకొని వందల కిలోమీటర్లు కాలినడకన వారి స్వరాష్ట్రాలకు వెళ్ళవలసిన అవసరం ఉండేది కాదు. అలాగే దేశ వ్యాప్తంగా వారి కోసం క్వారెంటైన్ శిబిరాలు నిర్వహించవలసిన అవసరం కూడా ఉండేది కాదు. అప్పుడు కేంద్రప్రభుత్వం సకాలంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడం వలన లక్షలాది వలస కార్మికులు నానా కష్టాలు అనుభవించారు.
ఇన్ని రోజుల తరువాత ఇక నేడో రేపో అన్ని రాష్ట్రాలలో గ్రీన్, ఆరెంజ్ జోన్‌లలో పాక్షికంగా లాక్‌డౌన్ ఎత్తివేసి మళ్ళీ అన్ని రంగాలు పని ప్రారంభించేలా చేయాలని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నప్పుడు, వలస కార్మికులను వారి స్వస్థలాలకు పంపించివేయడం మరో తప్పుడు నిర్ణయమేనని భావించవలసి ఉంటుంది. ఎందుకంటే, దాదాపు అన్ని రంగాలలో వలస కార్మికులే ఎక్కువగా పనిచేస్తుంటారు కనుక మళ్ళీ వారి అవసరం చాలా ఉంటుంది. కానీ వారినందరినీ స్వస్థలాలకు పంపించివేస్తుండటం వలన పాక్షికంగా లాక్‌డౌన్ ఎత్తివేసిన తరువాత పనులు ప్రారంభించలేని పరిస్థితి ఏర్పడవచ్చు. కనుక ఈ సమయంలో వలస కార్మికుల తరలింపు నిర్ణయం సరైనదా కాదా? అనే ప్రశ్నకు రానున్న రోజులలో సమాధానం లభిస్తుంది.