మహా సీఎం ఉద్ధవ్ థాక్రేకు మహా గండాలు

April 30, 2020


img

ప్రస్తుతం మహారాష్ట్రాలో కరోనా సంక్షోభం నెలకొంది. దేశంలో మిగిలిన అన్ని రాష్ట్రాల కంటే మహారాష్ట్రాలోనే అత్యధికంగా కరోనా కేసులు, మృతుల సంఖ్య నమోదు అవుతున్నాయి. అవి నానాటికీ శరవేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా రాజధాని ముంబైలో జనసాంద్రత చాలా ఎక్కువగా ఉన్నందున అక్కడ కరోనాను కట్టడి చేయడం చాలా కష్టమవుతోంది. నానాటికీ పెరిగిపోతున్న కరోనా కేసులను ఏవిధంగా అడ్డుకోవాలో తెలియక తలపట్టుకొన్న మహా సర్కారుకు ఇప్పుడు మరో మహా సమస్య ఎదురైంది. అదే..మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు పదవీ గండం! 

రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రి లేదా మంత్రి పదవులు చేపట్టినవారు శాసనసభ లేదా మండలిలో విధిగా సభ్యులై ఉండాలి. ఒకవేళ కాకపోతే మంత్రి పదవి  చేపట్టిన ఆరు నెలలలోపుగా రెండు సభలలో ఏదో ఒక దానికి తప్పనిసరిగా ఎన్నికవలసి ఉంటుంది. మహా సీఎం ఉద్ధవ్ థాక్రేకు దేనిలోనూ సభ్యత్వం లేదు కనుక నిబందన ప్రకారం మే 27లోగా సభ్యత్వం పొందవలసి ఉంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితులలో ఎన్నికలు నిర్వహించడం వీలుపడదు. 

ప్రస్తుత పరిస్థితులలో థాక్రే ముందు ఒకే ఒక మార్గం ఉంది. అదే..గవర్నర్‌ కోటాలో మండలికి నామినేట్ చేయబడటం. గవర్నర్‌ కోటాలో రెండు సీట్లున్నాయి. కనుక తనను మండలి సభ్యుడిగా నామినేట్ చేయమని ఉద్ధవ్ థాక్రే గవర్నర్‌ కోషియారీని కోరారు. 

కానీ మహారాష్ట్రలో బిజెపికి దక్కవలసిన అధికారాన్ని ఉద్ధవ్ థాక్రే కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి దక్కించుకోవడంతో కేంద్రం ఆయనపై గుర్రుగా ఉంది. కేంద్రం అనుమతి లేనిదే గవర్నర్‌ ఉద్ధవ్ థాక్రేను మండలికి నామినేట్ చేయరనేది బహిరంగ రహస్యం. అందుకే న్యాయనిపుణులతో సంప్రదించిన తరువాత తన అభిప్రాయం చెపుతానని చెప్పి ఉద్ధవ్ థాక్రేను తిప్పి పంపించేశారు. 

క్రీడలు, సాహిత్యం, కళలు, సమాజాసేవ వంటి ఏదైనా రంగంలో పనిచేసినవారినే ఆ కోటాలో నియమించాలనే నిబందన కూడా ఉంది. కనుక గవర్నర్‌ విచక్షణాధికారాన్ని ఉద్ధవ్ థాక్రే ప్రశ్నించలేరు. ఆయనను బ్రతిమాలుకోవడం తప్ప ఒత్తిడి చేయలేని పరిస్థితి ఉంది. 

కారణాలు ఏవైతేనేమి రెండు వారాలు గడుస్తున్నా థాక్రే విజ్ఞప్తిపై గవర్నర్‌ స్పందించలేదు. మరోపక్క థాక్రేకు గడువు దగ్గర పడుతోంది. ఒకవేళ గవర్నర్‌ నామినేట్ చేయకపోతే థాక్రే మే 27న తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకతప్పదు. 

ఇటువంటి పరిస్థితి ఎదురవుతుందని ఊహించని ఉద్ధవ్ థాక్రే, ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షాలపై తీవ్ర విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు వేరే గత్యంతరం లేకపోవడంతో ఉద్ధవ్ థాక్రే ప్రధాని నరేంద్రమోడీకి ఫోన్‌ చేసి సాయం కోరినట్లు తెలుస్తోంది. మరి ప్రధాని నరేంద్రమోడీ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి? 


Related Post