కరోనా నుంచి తెలంగాణ విముక్తి పొందడం సాధ్యమేనా?

April 30, 2020


img

తెలంగాణలో కరోనా పరీక్షలు, కేసుల సంఖ్యపై ప్రతిపక్షాల అనుమానాలను, సందేహాలను పక్కనపెడితే ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో కరోనా దాదాపు నియంత్రణలోకి వచ్చింది. త్వరలోనే రాష్ట్రంలో కరోనా నుంచి విముక్తి పొందబోతోంది. అయితే తెలంగాణకు సరిహద్దు రాష్ట్రాలైన ఆంధ్రా, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులో కరోనా విజృంభిస్తున్నప్పుడు, ఆ రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి కరోనా ప్రవేశించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏవిధంగా అడ్డుకోగలదు?అనే ప్రశ్నకు సంతృప్తికరమైన సమాధానం చెప్పగలిగితే రాష్ట్రం కరోనా నుంచి విముక్తి పొందినట్లే భావించవచ్చు. 

తాజా లెక్కల ప్రకారం ఏపీలో 1,403, మహారాష్ట్రలో 9,915, కర్ణాటకలో 534, తమిళనాడులో 2,162 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఒక్క పాజిటివ్ కేసు కూడా లేనప్పటికీ ఈ నాలుగు రాష్ట్రాల నుంచి మళ్ళీ కరోనా రాష్ట్రంలోకి తప్పక ప్రవేశిస్తుంది. 

అలాగే దేశంలో వివిద రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి రకరకాల సరుకులు వస్తుంటాయి. కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర నుంచి ఉల్లిపాయలు, పంచదార వగైరా, ఏపీ నుంచి మామిడిపళ్లు, ఇతర ఆహార ఉత్పత్తులు వస్తుంటాయి. వాటిద్వారా కూడా రాష్ట్రంలోకి మళ్ళీ కరోనా ప్రవేశించే ప్రమాదం పొంచి ఉంది. 

కనుక తెలంగాణలో కరోనాను పూర్తిగా కట్టడి చేస్తే సరిపోదు. పొరుగు రాష్ట్రాల నుంచి వివిద రూపాలలో వచ్చే కరోనా వైరస్‌ను అడ్డుకోవడానికి ప్రత్యేక వ్యవస్థను, మార్గదర్శకాలను తప్పక ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది లేకుంటే తెలంగాణ ప్రభుత్వం ఇంతకాలం చేసిన కృషి, ప్రయత్నాలు ఆన్నీ వృధా అవుతాయి.


Related Post