కరోనా వైరస్ గురించి అమెరికా నిఘా సంస్థలు చాలా ముందుగానే హెచ్చరించినప్పటికీ వాటిని తేలికగా తీసుకొన్నందుకు అమెరికా...ప్రజలు ఇప్పుడు భారీ మూల్యం చెల్లిస్తున్నారు. ఇప్పటి వరకు అమెరికాలో 10,63,600 మందికి కరోనా సోకగా వారిలో 61,472 మంది చనిపోయారు. ప్రతీరోజు కొన్నివేల కొత్త కేసులు నమోదవుతున్నాయి. కనీసం 1,900-2,000 మంది మరణిస్తూనే ఉన్నారు. సుమారు 9 ఏళ్ళపాటు ఏకధాటిగా సాగిన వియత్నాం యుద్ధంలో అమెరికా 58,220 మంది సైనికులను కోల్పోగా, కేవలం రెండు నెలల వ్యవధిలోనే 61,472 మంది కరోనాతో చనిపోయారు!
అమెరికా చరిత్రలో అత్యంత క్లిష్ట పరిస్థితులు నెలకొన్న ఈ సమయంలో లాక్‌డౌన్ కారణంగా ఆర్ధిక మాంద్యం కూడా ఏర్పడబోతుండటంతో డోనాల్డ్ ట్రంప్ మరో సాహసోపేతమైన నిర్ణయం తీసుకొన్నట్లు తాజా సమాచారం.
వచ్చే వారం నుండి దేశీయ ప్రజారవాణా వ్యవస్థలను ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కరోనా...లాక్‌డౌన్ నేపధ్యంలో నవంబర్ 4న జరుగవలసిన అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయా... లేదా? అనే సందేహాలపై ట్రంప్ స్పందిస్తూ ఎట్టి పరిస్థితులలో ఎన్నికలు అదే రోజున జరిపిస్తామని ప్రకటించారు. కనుక త్వరలోనే ఒహాయో రాష్ట్రంలో పర్యటించి భారీ బహిరంగసభను నిర్వహించబోతున్నట్లు సమాచారం.
మొదట కరోనాను తేలికగా తీసుకొని మూల్యం చెల్లిస్తున్న ట్రంప్, ఇప్పుడు కరోనా దానంతట అదే పోతుందని వ్యాక్సిన్ కోసం తాను ఎదురుచూడటం లేదని చెప్పడం నిజమే అయితే నేటికీ ఆయన కరోనాను చాలా తేలికగానే తీసుకొంటున్నట్లు భావించవలసి ఉంటుంది. బహుశః అందుకే ప్రజారవాణా వ్యవస్థలను పునరుద్దరించి, బారీ బహిరంగసభల నిర్వహణకు సిద్దపడుతున్నారనుకోవాలేమో? కానీ లాక్‌డౌన్ అమలులో ఉండగానే ప్రతీరోజు 20-24,000 కొత్త కేసులు, 1,900-2,000 మంది మరణిస్తుంటే, ప్రజలు స్వేచ్ఛగా తిరగడం ప్రారంభించి, అందరూ ఒక్కచోట చేరి బహిరంగసభలలో పాల్గొంటే ఏమవుతుందో ఊహించవచ్చు.
దేశ ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరచడం చాలా అవసరమే కానీ దాని కోసం మిగిలిన రాష్ట్రాలకు కూడా కరోనాను వ్యాపింపజేయడం అనర్ధమే అవుతుంది. ట్రంప్ నిర్ణయాలు అమెరికా భవిష్యత్‌ను మార్చివేయనున్నాయి. అది ఏవిధంగా అనేది కాలమే చెపుతుంది.