కరోనా..మేడ్ ఇన్ చైనా...లాభనష్టాలు!

April 29, 2020


img

కరోనాకు యావత్ ప్రపంచదేశాలు చాలా భారీ మూల్యం చెల్లిస్తున్నాయి. ముఖ్యంగా అగ్రరాజ్యమైన అమెరికా ఈ చైనా ఉత్పత్తి కరోనాకు దాసోహమనక తప్పని పరిస్థితి దాపురించింది. అందుకే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ చైనాపై నిప్పులు కక్కుతున్నారు. అయితే ప్రపంచదేశాలలో తనను దోషిగా నిలబడవలసివస్తే ఏమవుతుందో చైనాకు కూడా తెలుసు. అందుకే అమెరికాపై ఎదురుదాడి చేస్తోంది.   

ట్రంప్‌ తన ప్రభుత్వం వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికే చైనాపై ఆరోపణలు చేస్తున్నారని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జెంగ్  షువాంగ్ విమర్శించారు. ట్రంప్‌ మొదట్లో కరోనాను తేలికగా తీసుకొన్నందునే అమెరికాకు నేడు ఈ దుస్థితి ఏర్పడిందని ప్రతిపక్ష డెమొక్రాట్లు, మీడియాలో ఒకవర్గం కూడా నిందిస్తున్నారు. కనుక వాటితో చైనా వాదనలకు ఓ పునాది ఏర్పడింది. 

రోనా విషయంలో చైనా గోప్యత, అలసత్వం ప్రదర్శించి ప్రపంచానికి ఈ దుస్థితి కల్పించిందని చెప్పక తప్పదు. అదేవిధంగా ట్రంప్‌ కరోనాను తేలికగా తీసుకొన్నందునే అమెరికాకు నేడు ఈ దుస్థితి ఏర్పడిందనేది వాస్తవం.  కానీ అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకొన్న భారత్‌ వంటి అనేక దేశాలు కూడా ఈ చైనీస్ వైరస్‌కు భారీ మూల్యం చెల్లిస్తున్నాయి. అంటే ఈ విషయంలో చైనాయే అసలైన దోషి అని చెప్పకతప్పదు. 

చైనా తన ఉత్పత్తులను ఏవిధంగా విరివిగా ప్రపంచదేశాలకు ఎగుమతి చేసి లాభాలు ఆర్జిస్తుందో అదేవిధంగా తెలిసో తెలియకనో ఈ కరోనాను కూడా ఎగుమతి చేసింది. దానిని ఎదుర్కొనేందుకు ఇప్పుడు టెస్టింగ్ కిట్స్, మాస్కూలు, గ్లౌజులు, రక్షణ దుస్తులు వగైరాలను ఎగుమతి చేస్తూ లాభాలు కూడా ఆర్జిస్తోంది. త్వరలో కరోనాకు వ్యాక్సిన్ కూడా తయారుచేసి దానినీ ఎగుమతి చేసి లాభాలు ఆర్జించడం ఖాయం. అంటే కరోనా విషయంలో చైనాను అనుమానించక తప్పదన్నమాట! 

కరోనాతో అగ్రరాజ్యాలను దారుణంగా దెబ్బతీసిన చైనా ఇప్పుడు ప్రపంచదేశాలన్నీ తనపైనే ఆధారపడేలా చేసుకొంటోంది. కనుక కరోనా విషయంలో చైనాపై అమెరికా వ్యక్తం చేస్తున్న అనుమానాలు, ఆరోపణలను కూడా కొట్టిపడేయలేము. కనుక చైనా దీనికి తప్పనిసరిగా జవాబు చెప్పాలి.. ప్రపంచదేశాలు ఎదుర్కొంటున్న ఈ సమస్యలన్నిటికీ బాధ్యత వహించక తప్పదు.

కానీ ప్రపంచంలో ఇన్ని లక్షలమంది కరోనా బారినపడుతున్నా...చనిపోతున్నా... దేశాలు ఆర్ధికంగా నష్టపోతున్నా చైనా పాలకులు ఏనాడూ పశ్చాతాపం.. కనీసం అపరాధాభావం వ్యక్తం చేయలేదు. పైగా అమెరికాపై ఎదురుదాడి చేస్తోంది.  కనుక అమెరికా ఒత్తిళ్లకు, హెచ్చరికలకు చైనా లొంగుతుందనుకోలేము.


Related Post