ఓల్డ్ మలక్‌పేటలో 750 కుటుంబాలకు విముక్తి

April 29, 2020


img


గత మూడు వారాలుగా ఓల్డ్ మలక్‌పేటలో గృహనిర్బందం (క్వారెంటైన్‌)లో ఉన్న 750 కుటుంబాలకు నేడు విముక్తి లభించింది. మలక్‌పేటలో ఒకే కుటుంబంలో 11 మందికి కరోనా సోకడంతో ఆ ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించి, ప్రజాలెవరూ ఇళ్ళలో నుంచి బయటకు రాకుండా జీహెచ్‌ఎంసీ అధికారులు, పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఆ ప్రాంతంలో అందరికీ పరీక్షలు చేయగా నెగెటివ్ అని నిర్ధారించుకొన్నారు. నేటితో ఐసోలేషన్ పీరియడ్ కూడా ముగియడంతో రెడ్‌జోన్‌ ఎత్తివేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. 

జీహెచ్‌ఎంసీ కమీషనర్ అశోక్ సామ్రాట్ అధ్వర్యంలో జీహెచ్‌ఎంసీ సిబ్బంది, పోలీసులు కలిసి ఓల్డ్ మలక్‌పేటలో ఏర్పాటు చేసిన బారికేడ్లను పూర్తిగా తొలగించారు. ఇక నుంచి ఆ ప్రాంతంలో ప్రజలు కూడా లాక్‌డౌన్‌ ఆంక్షలను పాటిస్తూ బయటకు వెళ్ళిరావచ్చునని డీసీపీ రమేష్ తెలిపారు. 

ఇన్నిరోజులు ఇళ్ళలోనే ఉండిపోయి కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తమకు సహకరించినందుకు జీహెచ్‌ఎంసీ, పోలీస్ అధికారులు స్థానిక ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ప్రజలు కూడా జీహెచ్‌ఎంసీ, పోలీస్ అధికారులకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.      

దేశంలో మొట్టమొదటి రెడ్‌జోన్‌గా గుర్తించబడిన కరీంనగర్‌లో కూడా మరో ఒకటి రెండు రోజులలో కరోనారహిత (గ్రీన్‌) జోన్‌గా కాబోతోంది. కరీంనగర్‌లో మొత్తం 19 మందికి కరోనా సోకగా వారిలో 18 మంది గాంధీ, కింగ్ కొఠీ ఆసుపత్రులలో చికిత్స పొంది కోలుకొని ఇళ్లకు తిరిగివచ్చారు. సాహేత్‌నగర్‌కు చెందిన మిగిలిన ఒక వ్యక్తి కూడా డిశ్చార్జ్ అయితే కరీంనగర్‌ కరోనారహితంగా మారుతుంది. మార్చి 19న కరీంనగర్‌ను రెడ్‌జోన్‌గా ప్రకటించినప్పటి నుంచి 50 వైద్య బృందాలు   జిల్లా కేంద్రంలో, కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న హుజూరాబాద్‌లో నిత్యం పర్యటిస్తూ ఎప్పటికప్పుడు ప్రజలకు వైద్యపరీక్షలు నిర్వహిస్తూ జిల్లాలో కరోనాను నియంత్రించాయి. 

అదే విధంగా జగిత్యాలలో 30, రాజన్న సిరిసిల్లాలో 36, పెద్దపల్లి జిల్లాలో 30 వైద్య బృందాలు నిరంతరం పర్యటిస్తూ కరోనాను కట్టడి చేశాయి. కనుక త్వరలోనే జగిత్యాల, రాజన్న సిరిసిల్లా జిల్లాలు కూడా గ్రీన్‌ జోన్‌లోకి మారబోతున్నాయి. 



Related Post