ఏపీలో కరోనా రాజకీయాలు..తెలంగాణతో లింక్

April 28, 2020


img

ఏపీలో రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో కరోనా రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కరోనాను కట్టడి చేయగలిగిందని కానీ ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా, అసమర్ధంగా వ్యవహరిస్తున్నందునే ఏపీలో నానాటికీ కేసులు పెరిగిపోతున్నాయని చంద్రబాబునాయుడు, టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డికి స్థానికసంస్థల ఎన్నికలపై ఉన్న శ్రద్ద కరోనా కట్టడిపై లేకపోవడం కూడా ఓ కారణమని వాదిస్తున్నారు. 

టిడిపి ఆరోపణలపై వైసీపీ ప్రభుత్వం కూడా ఘాటుగానే స్పందిస్తోంది. కానీ టిఆర్ఎస్‌తో ఉన్న అనుబందం కారణంగా తెలంగాణ ప్రభుత్వాన్ని నేరుగా వేలెత్తి చూపలేకపోతోంది. వైసీపీ ఎమ్మెల్యే రోజా చిత్తూరులో మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణలో కూడా మొదట్లో కరోనా కేసులు చాలా ఎక్కువే నమోదు అయ్యాయి. కానీ అక్కడి టిడిపి నేతలు సిఎం కేసీఆర్‌ను నిలదీయలేకపోయారు. ఇరుగుపొరుగు రాష్ట్రాలలో ప్రతీ 10 లక్షల మందిలో 430 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తుంటే, ఇక్కడ ఏపీలో ప్రతీ 10 లక్షల మందిలో 1,330 మందికి పరీక్షలు చేయిస్తున్నాము. అందుకే ఇక్కడ ఎక్కువ కరోనా కేసులు బయటపడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఇంత నిజాయితీగా పనిచేస్తుంటే అభినందించకపోగా చంద్రబాబునాయుడు, లోకేశ్ హైదరాబాద్‌లో కూర్చొని నోటికొచ్చినట్లు విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. వారికి దమ్ముంటే తెలంగాణలో రోజూ ఎంతమందికి పరీక్షలు చేయిస్తున్నారో కేసీఆర్‌ను అడగాలి,” అని అన్నారు. 

తెలంగాణ ప్రభుత్వం కరోనా కేసులను తక్కువ చేసి చూపిస్తోందని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు కేసీఆర్‌ ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే, ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నందుకు టిడిపి నేతలు జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తుండటం విశేషం. 

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కట్టడిలోకి వస్తుండటం అదే సమయంలో ఏపీలో కరోనా కేసులు పెరిగిపోతుండటంతో ప్రజలు కూడా రెండు ప్రభుత్వాల పనితీరును పోల్చి చూస్తుంటారు కనుక ఏపీ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడికి గురవడం సహజం. సరిగ్గా ఇటువంటి సమయంలో “కరోనాను కట్టడి చేయడానికి తమ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని కానీ సాధ్యపడటంలేదని కనుక ఇకపై కరోనాతో కలిసి బ్రతికేందుకు ప్రజలు సిద్దపడాలని..కరోనా ఎవరికైనా సోకవచ్చని దానిని చూసి భయపడనవసరం లేదని,” ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి చేసిన తాజా ప్రకటన ఏపీ ప్రభుత్వంపై ఇంకా జోరుగా విమర్శలు గుప్పించేందుకు ప్రతిపక్షాలకు అవకాశం కల్పించినట్లయింది. కరోనా మహమ్మారి నుంచి ఏవిధంగా బయటపడాలని ఆలోచించవలసిన ఈ క్లిష్ట సమయంలో ఏపీలో ఈవిధంగా రాజకీయాలు జరుగుతుండటం చాలా శోచనీయమే.


Related Post