గల్ఫ్ కార్మికులకు శుభవార్త!

April 28, 2020


img

గల్ఫ్ దేశాలలో పనిచేస్తున్న కార్మికులకు ఓ శుభవార్త. మే 3న లాక్‌డౌన్‌ తరువాత గల్ఫ్ దేశాల నుంచి కార్మికులను వెనక్కు రప్పించాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వాలతో, భారత్‌ విమానయాన సంస్థలు, భారత్‌ వాయుసేన, నావికాదళంతో సంప్రదింపులు జరుపుతోంది. 

గల్ఫ్ దేశాలలో సుమారుగా కోటిమంది భారతీయులు పనిచేస్తున్నారని కేంద్రప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ పరిస్థితులలో ఒకేసారి అంతమందిని తీసుకురావడం కష్టమే. విదేశాల నుంచి అంతమందిని భారత్‌కు తిరిగి తీసుకురావడం వలన మళ్ళీ కరోనా విజృంభించే ప్రమాదం, సామాజిక సమస్యలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుంది. పైగా ఇది చాలా భారీ ఖర్చుతో కూడుకొన్న వ్యవహారం. 

లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్రాల ఆర్ధిక పరిస్థితి చాలా క్షీణించింది కనుక గల్ఫ్ కార్మికులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి డబ్బు చెల్లించే పరిస్థితిలో లేవు. ఒకవేళ ఇచ్చినా ఏదో నామమాత్రంగానే ఉంటుంది కనుక కేంద్రప్రభుత్వమే ఈ భారమంతా భరించవలసి ఉంటుంది. 

పౌరవిమానయాన శాఖ 500 విమానాలు ఏర్పాటు చేయగలమని చెప్పగా, భారత్‌ నావికాదళం తమ వద్ద ఉన్న మూడు భారీ యుద్ధనౌకలలో సుమారు 1,500 మంది చొప్పున తీసుకురాగలమని చెప్పినట్లు సమాచారం. ఒకవేళ ఇది కార్యరూపం దాలిస్తే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఇదే భారీ తరలింపు అవుతుంది.


Related Post