కరోనా ఎన్నటికీ పోదు..దానితో కలిసి బతకడం నేర్చుకోవాలి: ఏపీ సిఎం జగన్‌

April 28, 2020


img

ఏపీలో రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్న ఈ సమయంలో సిఎం జగన్‌మోహన్‌రెడ్డి కరోనాను పూర్తిగా నివారించలేమని, కనుక దానితో సహజీవనం చేయడం అలవాటు చేసుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రజలనుద్దేశ్యించి ఆయన మంగళవారం ట్విట్టర్‌లో ఒక వీడియో సందేశం పోస్ట్ చేశారు. దానిలో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎమన్నారంటే, “మనం ఇన్ని చర్యలు తీసుకొన్నా కూడా వాస్తవం ఏమిటంటే మనం దీన్ని ఎప్పటికీ కట్టడి చేయలేము. పూర్తిగా తొలగించలేము. ఎక్కడో అక్కడ ఒక్క కరోనా రోగి మిగిలిపోయినా కూడా అతని ద్వారా మళ్ళీ మళ్ళీ కరోనా వస్తూనే ఉంటుంది. కనుక దీనికి అంతమనేది ఉండదు. రాబోయే రోజులలో మనం కరోనాతో కలిసి జీవించాల్సి ఉంటుందని మనమందరం గమనించాలి. 

కరోనాను మనం పూర్తిగా నివారించలేము కనుక రాబోయే రోజులలో అందరికీ కరోనా వచ్చే అవకాశం ఉంటుంది. అది ఏ ఎల్లయ్యకో.. పుల్లయ్యకో రావచ్చు... లేదా నాకే రావచ్చు. ఇకపై కరోనా మన జీవితాలలో భాగం కానుంది. అది కేవలం ఓ జ్వరం వంటిది మాత్రమే. కనుక కరోనాను చూసి మనం భయపడనవసరం లేదు. అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్లిపోతుందో కూడా తెలియకపోవచ్చు. బహుశః ఆసుపత్రికి కూడా వెళ్లవలసిన అవసరం ఉండకపోవచ్చు. కరోనాను ఎదుర్కోవడానికి కాస్త జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. ఎవరికైనా కరోనా వస్తే మందుకు తీసుకొంటే నయమైపోతుంది. కరోనాతో కలిసి జీవించవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి కనుక మనలో రోగ నిరోధకశక్తి పెంచుకుంటే సరిపోతుంది,” అని అన్నారు. 


Related Post