కరోనాతో చైనా వ్యాపారం!

April 28, 2020


img

ప్రపంచానికి తీరని ప్రాణనష్టం, ఆర్ధికనష్టం కలుగజేస్తున్న కరోనా మహమ్మారి చైనాలోని వూహాన్‌లో పుట్టిందని అందరికీ తెలుసు. కరోనా దెబ్బకు భయపడి ప్రపంచదేశాలన్నీ లాక్‌డౌన్‌ చేసుకోవడంతో వాటి ఆర్ధిక పరిస్థితులు వేగంగా క్షీణిస్తుంటే, వాటికి సాయం చేసే సాకుతో ఈ సంక్షోభ సమయంలో కూడా చైనా ‘కరోనా వ్యాపారం’ చేస్తూ లాభాలు ఆర్జిస్తుండటం విశేషం. కరోనా టెస్టింగ్ కిట్స్, వైద్యసిబ్బందికి అవసరమైన రక్షణ దుస్తులు, మందుల కోసం భారత్‌తో సహా చాలా దేశాలు చైనాపైనే ఆధారపడటంతో ఆ దేశం కరోనాతో కూడా లాభాలు కళ్ళజూస్తోంది.

అయితే చైనా నుంచి ఇటీవల భారత్‌ దిగుమతి చేసుకొన్న రాపిడ్ టెస్టింగ్ కిట్స్ నాణ్యమైనవి కాకపోవడంతో వాటిని వినియోగించవద్దని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఇకపై చైనా నుంచి ఆ కిట్లను కొనవద్దని, ఇప్పటికే రప్పించినవాటిని వెనక్కు తిప్పి పంపించాలని, వాటి కోసం ఎటువంటి చెల్లింపులు చేయవద్దని సూచించింది. 

ఐసీఎంఆర్‌ సూచనపై చైనా ప్రభుత్వం స్పందించింది. చైనా రాయబారి జీరోంగ్ ఈరోజు ఉదయం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. దానిలో ఏమి వ్రాశారంటే, “ ఆ టెస్టింగ్ కిట్స్ నాణ్యత ప్రమాణాలను చైనా వైద్య ఉత్పత్తుల పాలనావిభాగం, పూణేలోగల జాతీయ వైరాలజీ సంస్థ రెండూ క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత ఆమోదించాయి. అయితే వాటి రవాణా, స్టోరేజీ, వాడకంలో సరైన జాగ్రత్తలు పాటించకపోతే వాటి పనితీరుపై ప్రభావం చూపుతుందనే విషయం పట్టించుకోకుండా భారత్‌లో కొందరు అవి నాసిరకమని అనుచితంగా, బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు. అత్యున్నత ప్రమాణాలు పాటించే చైనా కంపెనీలలో తయారైన ఈ ఉత్పత్తులను భారత్‌ గౌరవిస్తుందనే భావిస్తున్నాము. టెస్టింగ్ కిట్స్ నాణ్యత విషయంలో ఏర్పడిన సందేహాలను, అనుమానాలను నివృతి చేసేందుకు వాటిని సరఫరా చేస్తున్న రెండు కంపనీలు భారత్‌లో క్షేత్రస్థాయిలో పర్యటించడానికి సిద్దంగా ఉన్నాయి. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు చైనా చిత్తశుద్దితో ప్రయత్నిస్తుంది. కరోనా వైరస్ యావత్ మానవాళికి శత్రువు. దానితో భారత్‌తో సహా ప్రపంచదేశాలు చేస్తున్న పోరాటంలో చైనా కూడా పాల్గొంటుంది,” అని అన్నారు.


Related Post