లాక్‌డౌన్‌ తరువాత ఏమిటి...ఎలా?

April 27, 2020


img

ఇప్పటివరకు కరోనా మహమ్మారితో పోరాటంలో బిజీగా ఉన్న భారత ప్రభుత్వం లాక్‌డౌన్‌ తరువాత ఏమి చేయాలి? ఎలా చేయాలి? అనే రెండు చిన్న ప్రశ్నలకు సమాధానాలు వెతికే పనిలో పడింది. ఎందుకంటే ఇక నుంచి కరోనాతో సహజీవనం చేయవలసి ఉంటుంది కనుక. అయితే ఇది ఒక్క భారత్‌ సమస్య మాత్రమే కాదు.. యావత్ ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సమస్య అని అందరికీ తెలుసు. 

మళ్ళీ దేశంలో అన్ని వ్యవస్థలు ఇదివరకులా పనిచేయాలంటే ముందుగా బస్సులు, రైళ్లు, మెట్రోలు, విమానసర్వీసులు వంటి ప్రజారవాణా ప్రారంభించాల్సి ఉంటుంది. కానీ అక్కడే కరోనా వ్యాపించే ప్రమాదం ఉంటుంది కనుక వాటిని ఏవిధంగా నడిపించాలి?అనే ప్రశ్న ఎదురవుతోంది. 

నేడు కాకపోతే రేపైనా లక్షలాదిమంది ప్రజలు రోడ్లపైకి రాకతప్పదు. వస్తే కరోనా వ్యాపించకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?జాగ్రత్తలు తీసుకొన్నా కరోనా వ్యాపిస్తే దానిని ఏవిధంగా ఎదుర్కోవాలి? అనే ప్రశ్నలకు సమాధానాలు కనుగొనవలసి ఉంది. 

జనం మద్యనే కరోనా అదృశ్యరూపంలో తిరుగుతున్నప్పుడు, స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు, హోల్ సేల్, రీటైల్ మార్కెట్లు, సినిమా హల్స్, షాపింగ్ మాల్స్, ఫంక్షన్ హాల్స్, పరిశ్రమలు వంటివన్నీ ఏవిధంగా నడిపించాలి?అనే మరో ప్రశ్న ఉంది. 

వీటన్నిటికీ ఒకే ఒక సమాధానం కనిపిస్తోంది. అదే.. కరోనాకు వ్యాక్సిన్ లేదా నివారణ అందుబాటులోకి తీసుకురావడమే. కానీ అది సామాన్య ప్రజలకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో? అప్పటి వరకు ఎలా బ్రతకాలో?సమాధానాలు లేని ప్రశ్నలు. కానీ ఇటువంటి సమస్యలు, సవాళ్ళు ఎదుర్కొని బయటపడగలిగిగే శక్తి మానవులకు ఉందనే ఒకే ఒక ఆశ కూడా ఉంది. 


Related Post