పెద్దన్నా...ఈ సమయంలో ఎందుకీ దూకుడు?

April 25, 2020


img

మనిషి జీవితంలో రాణించాలంటే కాస్త దూకుడు అవసరమని ఓ సినిమాలో హీరో చెప్తాడు. కరోనాను ముందే గుర్తించి కట్టడిచేయడంలో చాలా దూకుడుగా వ్యవహరించాల్సిన సమయంలో చాలా నిదానంగా వ్యవహరించి, ఇప్పుడు తీరికగా బాధపడుతున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌, అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో చైనా, ప్రపంచ ఆరోగ్య సంస్థలతో ఇప్పుడు చాలా దూకుడుగా వ్యవహరిస్తుండటం విశేషం. 

కరోనా వైరస్ చైనాలోని వుహాన్‌లోనే పుట్టి ప్రపంచమంతా పాకిందని, ఈ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అలసత్వం ప్రదర్శించిందనే సంగతి ఇప్పటికే స్పష్టమైంది. కానీ అమెరికాతో సహా చాలా దేశాలు కరోనాను ‘లైట్’గా తీసుకోవడం వలననే ఈ సమస్య ఇంత తీవ్రరూపం దాల్చిందని అందరికీ తెలుసు. ఇటువంటి వైరస్‌లను ముందే పసిగట్టి వాటి తీవ్రతను, పర్యవసనాలను అంచనాలు వేసి హెచ్చరించే వ్యవస్థలు అమెరికాలో ఎప్పటి నుంచో ఉన్నాయి. అవి ముందస్తు హెచ్చరికలు చేసినప్పటికీ ట్రంప్‌ వాటిని పట్టించుకోలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ట్రంప్‌ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకొని, నవంబరులో జరుగబోయే అధ్యక్ష ఎన్నికలలో ప్రజాగ్రహం నుంచి తప్పించుకొనేందుకే చైనా, ప్రపంచ ఆరోగ్య సంస్థలపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. 

ఈ క్లిష్ట సమయంలో ప్రపంచ దేశాలు చాలా సమన్వయంతో పరస్పరం సహకరించుకొంటూ ముందుకు సాగి కరోనాను, ఆర్ధిక సంక్షోభాన్ని అధిగమించాల్సి ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రమే అటువంటి సమన్వయం సాధించగలదు. కానీ ఈ అత్యవసర సమయంలో అమెరికా దానికి నిధులు నిలిపివేయడమే కాకుండా తీవ్రంగా విరుచుకుపడుతుండటంతో దాని పనితీరు ఇంకా క్షీణించే ప్రమాదం ఉంటుంది. ‘తిలా పాపం..తలో పిడికెడు’ అన్నట్లు కరోనా విషయంలో అందరూ తప్పులు చేశారు కనుక వీలైనంత త్వరగా ఈ సమస్య నుంచి బయటడాలనుకొంటే ఈవిధంగా నిందించుకొంటూ కాలక్షేపం చేయడం కంటే అమెరికాతో సహా అన్ని దేశాలు ప్రపంచ ఆరోగ్య సంస్థకు అండగా నిలబడటమే మంచిది. ప్రపంచదేశాలన్నీ ఈ భయానక సమస్య నుంచి బయటపడిన తరువాత అమెరికా ఏమైనా చేసుకోవచ్చు కదా?


Related Post