తెలంగాణలో మరో నాలుగు విప్లవాలు?

April 25, 2020


img

ఉద్యమాలు చేసి సాధించుకొన్న తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజులలో వరుసగా మరో నాలుగు విప్లవాలు రాబోతున్నాయి. ఇది ఏ సిద్దాంతులో భవిష్యవాణిలో చెప్పలేదు.. మంత్రి కేటీఆర్‌ చెప్పారు. అయితే ఈ విప్లవాలలో ప్రజాలెవరూ రోడ్లపైకి వచ్చి ఉద్యమించరు. రాష్ట్ర ప్రభుత్వమే ఆ విప్లవాలకు నాంది పలుకుతోంది! ఎందుకంటే వాటి వలన రాష్ట్రానికి, దేశానికి, ప్రజలందరికీ ఎంతో మేలు కలుగబోతోంది. ఇంతకీ మంత్రి కేటీఆర్‌ చెప్పిన ఆ నాలుగు విప్లవాలు ఏమిటంటే.. 1. గులాబీ విప్లవం. 2. నీలి విప్లవం. 3. హరిత విప్లవం. 4. క్షీర విప్లవం. 

1. గులాబీ విప్లవం: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న గొర్రెల పంపిణీ పధకం ద్వారా రాష్ట్రంలో మాంస ఉత్పత్తులు గణనీయంగా పెరుగబోతున్నాయి. 

2. నీలి విప్లవం: తెలంగాణ ఏర్పడిన వెంటనే రాష్ట్రంలో గల సుమారు 55,000 చెరువులలో పూడిక తీయించిన సంగతి తెలిసిందే. కాళేశ్వరం, ఇంకా ఇతర ప్రాజెక్టుల ద్వారా వచ్చే నీటిని వాటిలో నింపుతున్నారు. నిండుకుండల్లా మారిన ఆ చెరువులలో ఏటా కోట్లాది చేప పిల్లలు విడిచిపెడుతున్నారు. వాటి ద్వారా రాష్ట్రంలో చేపల పెంపకం, ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ఒకప్పుడు చేపల కోసం తెలంగాణ రాష్ట్రం ఇరుగుపొరుగు రాష్ట్రాలపై ఆధారపడవలసి వచ్చేది. కానీ ఇప్పుడు ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యలతో తెలంగాణకు అవసరమైన చేపలను ఉత్పత్తి చేసుకోవడమే కాక ఇతర రాష్ట్రాలకు చేపలను సరఫరా చేసే స్థాయికి ఎదుగబోతోంది. రాష్ట్రంలో ఇప్పటికే ఈ నీలివిప్లవం మొదలైంది.

3. హరిత విప్లవం: తెలంగాణ ఏర్పడే సమయానికి రాష్ట్రంలో పచ్చదనం నామమాత్రంగా ఉండేది. అది రాష్ట్ర వాతావరణంపై విపరీత ప్రభావం చూపేది. వాయు కాలుష్యం, అధిక ఉష్ణోగ్రతలు, వర్షాభావ పరిస్థితులు, వన్యప్రాణులకు ఆహారపు కొరత వంటి అనేక సమస్యలుండేవి. వాటన్నిటినీ పరిష్కారంగా తెలంగాణ ప్రభుత్వం హరితహారం పేరిట ఏటా వర్షాకాలం ప్రారంభం కాగానే కోట్లాది మొక్కలు నాటిస్తోంది. అది ఇప్పటికే సత్ఫలితాలు ఇస్తోంది కనుక హరిత విప్లవం కూడా మొదలైనట్లే భావించవచ్చు. కానీ రాష్ట్రంలో ఇంకా పచ్చదనం పెంపొందించేందుకు దీనిని నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 

4. క్షీర విప్లవం: రాష్ట్రంలో పాడిపశువుల పెంపకాన్ని ప్రోత్సహించడం ద్వారా క్షీరవిప్లవం సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తోంది. ఈ పధకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి మేలుజాతి ఆవులను వందల సంఖ్యలో తీసుకువచ్చి పాడిరైతులకు రాయితీపై అందజేస్తోంది. 

ఈ నాలుగు విప్లవాలు కూడా కాళేశ్వరం ప్రాజెక్టుతో ముడిపడి ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కాళేశ్వరం నుంచి వచ్చే నీటితో రాష్ట్రంలో పచ్చదనం పెరుగుతుంది. చెరువులు నిండుతాయి. భూగర్భజలాలు పెరుగుతున్నాయి. నీళ్ళు సమృద్ధిగా ఉన్నట్లయితే మనుషులు, ప్రకృతి, వన్యప్రాణులకు ఎంతో మేలు జరుగుతుంది. నీళ్ళు, పచ్చదనం పెరిగితే పశు, మత్స్య సంపద కూడా పెరుగుతుంది. రాబోయే 5 ఏళ్ళలో తెలంగాణ రాష్ట్రంలో కంటికి కనబడేంత స్పష్టంగా ఈ మార్పులన్నీ  ఏర్పడబోతున్నాయి. 


Related Post