గోదావరి జాలాలతో పులకించిన సిద్ధిపేట

April 24, 2020


img

ఎన్నో దశాబ్ధాలుగా సిద్ధిపేటవాసులు ఎదురుచూస్తున్న ఆ శుభసమయం వచ్చేసింది. జిల్లాలోకి గోదావరి జలాలు బిరబిరా తరలివచ్చాయి. మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావు ఇద్దరూ నేడు పూజలు చేసిన తరువాత సిద్ధిపేటలోని సర్జ్‌పూల్‌ పంపులను ఆన్‌ చేయగానే గోదావరి జాలాలు రంగనాయక్‌సాగర్‌ రిజర్వాయర్‌లోకి ప్రవహించాయి. మంత్రులు, ఉన్నతాధికారులు జలహారతినిచ్చి గలగల పారుతున్న గోదావరి జాలలను చూసి పులకించిపోయారు. 

ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ, “ఒకప్పుడు సిద్ధిపేటలో రైతులు నిత్యం ఆత్మహత్యలు చేసుకొనేవారు. పంటలు పండక వలసలు పోతుండేవారు. వారి కష్టాలు చూసి నేను చాలా బాధపడుతుండేవాడిని. ఎప్పటికైనా గోదావరి జలాలను సిద్ధిపేటకు పారించి వారి కష్టాలు తీర్చాలని అనుకొంటుండేవాడిని. సిఎం కేసీఆర్‌ దూరదృష్టి, పట్టుదలతో కేవలం మూడేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తయింది. నేడు నా చిరకాలవాంఛను తీరింది. ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినట్లు ప్రకటన విన్నప్పుడు ఎంతగా సంతోషించానో నేడు సిద్ధిపేటలో పారుతున్న ఈ గోదావరి జలాలను చూస్తున్నప్పుడు అంతగా సంతోషిస్తున్నాను. ఈ జన్మకు ఈ సంతోషం చాలనిపిస్తుంది. ఇక నుంచి జిల్లాలో...రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలుండవు. ఏడాది పొడవునా నీళ్ళు పారుతూనే ఉంటాయి. కనుక రైతులు రెండు పంటలు పండించుకోవచ్చు. సిద్దిపేటకు గోదావరి జలాలను పారించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్లు, అధికారులు, వేలాదిమంది కార్మికులు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను,” అని అన్నారు. 

సర్జ్‌పూల్‌ నుంచి రంగనాయక్ సాగర్ రిజర్వాయరులోకి నీటిని ఎత్తిపోసేందుకు ఒక్కొటి 135 మెగావాట్స్ సామర్ధ్యం కలిగిన నాలుగు భారీ మోటర్లను అమర్చారు. ఒక్కో మోటారు 24 గంటలలో 0.25టీఎంసీల నీళ్ళను ఎత్తిపోయగలదు.  ఈరోజు వాటిలో రెండు మోటర్లను మాత్రమే ఆన్‌లైన్‌లో చేసి రిజర్వాయరులో నీళ్ళు నింపడం ప్రారంభించారు. సుమారు 2,220 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడిన రంగనాయక్ సాగర్ రిజర్వాయరు పూర్తి సామర్ధ్యం 3 టీఎంసీలు కాగా, రాబోయే 5 రోజులలో రెండు పంపులతో 1.5 టీఎంసీలు నింపుతారు. ఆ తరువాత రంగనాయక్ సాగర్ నుంచి సిద్ధిపేట నియోజకవర్గంలో సిద్దిపేట రూరల్, అర్బన్, నాగ్నౌర్, నారాయణరావుపేట మండలాలలో గల 350 చెరువులను నింపుతారు. రంగనాయక్ సాగర్ ద్వారా సిద్ధిపేట జిల్లాలో 77,334 ఎకరాలకు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 33,384 ఎకరాలకు సాగునీరు, రెండు జిల్లాలకు అవసరమైన త్రాగునీరు అందుతుంది. గోదావరి జలాలు రాకతో రానున్న రోజులలో సిద్ధిపేట ముఖ చిత్రం సమూలంగా మారిపోనుంది. 


Related Post