ముస్లింలకు అసదుద్దీన్ ఓవైసీ పిలుపు

April 24, 2020


img

మజ్లీస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఈరోజు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “పవిత్ర రంజాన్ సదర్భంగా రాష్ట్రంలో ముస్లింలందరూ ఇళ్లలోనే ప్రార్ధనలు చేసుకోవాలి. ఇరుగుపొరుగువారిని ఆహ్వానించకుండా ఎవరికి వారు తమ తమ ఇళ్లలోనే ప్రార్ధనలు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. రాత్రి 7 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది కనుక ఎవరూ బయటకు రావద్దు. ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడమే పెద్దధర్మం. కనుక మీ చుట్టుపక్కల ఆకలితో ఉన్నవారిని ఆదుకోవాలి. కరోనా నుంచి కోలుకొన్నవారందరూ తప్పనిసరిగా రక్తదానం చేయాలి. తద్వారా ఆ రక్తం నుంచి సేకరించిన ప్లాస్మా ద్వారా కరోనా రోగులకు నివారణ లభిస్తుంది,” అని అన్నారు. 

లాక్‌డౌన్‌ గురించి మాట్లాడుతూ, “కేంద్రప్రభుత్వం ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు చేయకుండా లాక్‌డౌన్‌ ప్రకటించడం వలన లక్షలాదిమంది వలస కార్మికులు, వారి కుటుంబాలు ఆకలితో మాడిపోతున్నారు. వారిలో 90 శాతం మందికి రేషన్ కార్డులు, బ్యాంక్ ఖాతాలు లేనందున రేషన్ అందలేదు. ఎటువంటి ఆర్ధిక సాయం అందలేదు. కనీసం వారు పనిచేస్తున్న చోట జీతాలు అందలేదని తాజా సర్వేలో తేలింది. ఫుడ్ కార్పొరేషన్ గోదాములలో భారీగా నిలువచేసిన బియ్యాన్ని వలస కార్మికులకు అందజేసి వారిని ఆదుకోవాలి. లాక్‌డౌన్‌ తరువాత వారీనందరినీ స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని కోరుతున్నాను. లాక్‌డౌన్‌ కారణంగా దేశంలో సుమారు 10 కోట్లమంది ఉద్యోగాలు కోల్పోవచ్చునని సర్వేలు సూచిస్తున్నాయి కనుక కేంద్రప్రభుత్వం ఆ సమస్య పరిష్కారం కనుగొనాలి,” అని సూచించారు.


Related Post