‌చైనా కరోనా లెక్కలన్నీ దొంగలెక్కలేనా?

April 24, 2020


img

కరోనా తల్లి...చైనా చెపుతున్నవన్నీ దొంగలెక్కలేనని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ అంతటివాడు అనుమానం వ్యక్తం చేశారు. కరోనా గురించి చైనా ప్రపంచదేశాలతో సమాచారం పంచుకోవడంలేదని, చైనా ఏదో దాచిపెడుతోందంటూ అనేక ఆరోపణలు చేశారు. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వంటి అనేక ఇతరదేశాలు కూడా అదేవిధంగా అనుమానాలు వ్యక్తం చేస్తుండటంతో, ఆ ఒత్తిడి భరించలేక చైనా కరోనా కేసులు, మృతుల సంఖ్యను సుమారు 50 శాతం పెంచి చూపించింది. దాంతో చైనా దొంగలెక్కలు చెపుతోందనే ప్రపంచదేశాల అనుమానాలు, ఆరోపణలను చైనా స్వయంగా దృవీకరించినట్లయింది. 

తాజాగా హాంగ్‌కాంగ్ యూనివర్సిటీ మరో బాంబు పేల్చింది. ఫెంగ్ వూ అనే సీనియర్ శాస్త్రవేత్త నేతృత్వంలో యూనివర్సిటీకి చెందిన కొందరు శాస్త్రవేత్తలు చైనా కరోనా లెక్కలపై చాలా లోతుగా అధ్యయనం చేసి తమ నివేదికను లాన్సెట్ అనే అంతర్జాతీయ వైద్య జర్నల్లో ప్రచురించారు.

సాధారణంగా వివిద వైరస్‌ల పుట్టుక, వ్యాప్తి, చికిత్స, ఫలితాలు, నివారణ తదితర అనేక అంశాలను నిర్ధారించేందుకు అంతర్జాతీయంగా పాటించే కొన్ని ప్రమాణాలు ఉంటాయి. ఆ విస్తృత ప్రమాణాల ఆధారంగా చైనాలో కరోనా వైరస్ వ్యాప్తిపై అధ్యయనం చేసినప్పుడు, చైనా చెపుతున్న లెక్కలకు సుమారు నాలుగు రెట్లు కరోనా పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్య ఉండవచ్చని తేల్చి చెప్పారు. చైనా అధికారిక లెక్కల ప్రకారం సుమారు 83,000 మందికి కరోనా సోకింది. మృతుల సంఖ్య 4,632. కానీ హాంగ్‌కాంగ్ యూనివర్సిటీ తాజా నివేదిక ప్రకారం చైనాలో సుమారు 2.32 లక్షలకు పైగా కరోనా కేసులు, సుమారు 18-20,000కు పైగా మృతులు ఉండవచ్చని అర్ధమవుతోంది. 

వుహాన్‌లో కరోనా విజృంభించినప్పుడు దానిని ఏవిధంగా ఎదుర్కోవాలో తెలుసుకొనేందుకు చైనాకు కొంచెం సమయం పట్టి ఉండవచ్చు. కానీ చైనా నుంచి కరోనా ఇటలీ, స్పెయిన్ తదితర దేశాలకు పాకిన తరువాత దాని తీవ్రతను అర్ధం చేసుకొన్న ప్రపంచదేశాలు దానిని అడ్డుకొనేందుకు అనేకానేక చర్యలు తీసుకొన్నాయి. కానీ నేటికీ ఆ దేశాలలో కరోనా కేసులు, మృతుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. కనుక కరోనా గురించి అవగాహన లేని సమయంలోనే చైనా దానిని పూర్తిగా కట్టడి చేయగలిగిందని చెప్పడం ప్రపంచదేశాలను మభ్యపెట్టడమేనని అర్ధమవుతోంది. కనుక హాంగ్‌కాంగ్ యూనివర్సిటీ నివేదికలో చెప్పింది నిజమేనని భావించాల్సి ఉంటుంది. కానీ కరోనా గురించి చైనా అంత గుట్టుగా ఎందుకు వ్యవహరిస్తోంది? అనేది మిలియన్ డాలర్ ప్రశ్న. దానికి అమెరికా నిఘావర్గాలు సమాధానం కనిపెడతాయేమో చూద్దాం.


Related Post