తెలంగాణలో కొత్తగా 27... మొత్తం 970 కేసులు

April 24, 2020


img

తెలంగాణ రాష్ట్రంలో గురువారం కొత్తగా 27 కేసులు నమోదు అయ్యాయి. దాంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 970కి చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 13, జోగులాంబ గద్వాల జిల్లాలో 10, రంగారెడ్డి, మేడ్చల్, జనగామ, కుమురం భీం జిల్లాలో ఒక్కో కేసు నిన్న నమోదు అయ్యాయి. జీహెచ్‌ఎంసీలో నిన్న నమోదు అయిన కేసులలో నలుగురు చిన్నారులున్నారు. 

గురువారం ఒక వ్యక్తి కరోనాతో మరణించడంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 25కి చేరింది. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో 693 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. సంతోషకరమైన వార్త ఏమిటంటే గురువారం ఒక్కరోజే 58 మంది కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా నుంచి బయటపడిన వారి సంఖ్య 252కి చేరింది. 

భద్రాచలం కొత్తగూడెంలో గత 28 రోజులుగా ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడం మరో సంతోషకరమైన వార్త. ఈ జిల్లాలో నెలరోజుల క్రితం నలుగురికి కరోనా సోకగా వారిలో ఇద్దరు చికిత్సతో కోలుకొని ఇళ్లకు తిరిగివెళ్లారు. మరో ఇద్దరు ఇంకా చికిత్స పొందుతున్నారు. 

రాష్ట్రంలో రోజూ కొన్ని కొత్త కేసులు నమోదు అవుతున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటున్న కట్టుదిట్టమైన చర్యల వలన కరోనా కేసుల ఉదృతి బాగా తగ్గినట్లే కనిపిస్తోంది. కనుక సిఎం కేసీఆర్‌ చెప్పినట్లుగా రాష్ట్రంలో మే 7న లాక్‌డౌన్‌ ముగిసేనాటికి కరోనా పూర్తిగా నియంత్రణలో వచ్చే అవకాశం ఉంది.


Related Post