అమెరికా తలుపులు 60 రోజులు బంద్‌

April 23, 2020


img

కరోనా సంక్షోభంలో చిక్కుకొన్న అమెరికా విదేశీయులకు తలుపులు మూసివేసింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ ఈమేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై బుదవారం సంతకం చేశారు. ఆర్డినెన్స్ రూపంలో ఇది తక్షణం అమలులోకి వస్తుంది. దీని ప్రకారం నేటి నుంచి 60 రోజులపాటు విదేశీయులకు అమెరికా వీసాలు జారీ చేయడం నిలిపివేయబడతాయి. అమెరికాలో ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం హెచ్-1బీ వీసాల కోసం దరఖాస్తు చేసుకొన్నవారికి, ఇంకా కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకొంటున్నవారికి దీంతో బ్రేకులు పడినట్లే. 

విదేశాల నుంచి వచ్చేవారిని మాత్రమే కాక, హెచ్-1బీ వీసాలపై అమెరికాకు వచ్చి ఉద్యోగాలు చేస్తూ అక్కడే స్థిరపడేందుకు ‘గ్రీన్‌ కార్డు’ ల కోసం దరఖాస్తు చేసుకొన్నవారికి కూడా డోనాల్డ్ ట్రంప్‌ షాక్ ఇచ్చారు. గ్రీన్‌ జోన్‌ కార్డుల జారీని కూడా 60 రోజులపాటు తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించారు. ఈ 60 రోజుల కాలపరిమితి ముగిసే ముందు పరిస్థితులను బట్టి తగిన నిర్ణయం తీసుకొంటానని ట్రంప్‌ ప్రకటించారు. 

హెచ్-1బీ వీసాలపై కేవలం 60 రోజులు మాత్రమే నిషేదం విధిస్తున్నట్లు ట్రంప్‌ చెపుతున్నప్పటికీ కరోనా సంక్షోభం నుండి అమెరికా పూర్తిగా బయటపడి మళ్ళీ సాధారణ పరిస్థితులు ఏర్పడేవరకు దీనిని పొడిగించవచ్చు. అయితే కరోనా సంక్షోభం నుండి బయటపడిన తరువాత అమెరికా కొన్ని గడ్డు పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది కనుక వైద్య, ఆర్ధిక నిపుణులకు ఈ నిషేదం నుంచి మినహాయింపునివ్వవచ్చు. పర్యాటకులు, ఉన్నత విద్య, వైద్యం కోసం వచ్చేవారి వలన అమెరికాకు భారీగా ఆదాయం వస్తుంది కనుక అటువంటి వారందరికీ అమెరికాలోకి అనుమతించవచ్చు.


Related Post