వైద్యులపై దాడులు చేస్తే జైలుకే

April 22, 2020


img

కరోనా రోగులు, క్వారంటైన్‌లో ఉన్నవారు తరచూ వైద్యులు, వైద్య సిబ్బంది, ఆశావర్కర్లపై దాడులు చేస్తున్నారని, వారితో అసభ్యంగా వ్యవహరిస్తున్నారని తరచూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. రోగుల ప్రాణాలను కాపాడేందుకు తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది, తమపై జరుగుతున్న దాడులతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యను వారు ప్రభుత్వాలు, పోలీసుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ కటిన చర్యలు తీసుకోకపోవడంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆందోళన చేపట్టేందుకు సిద్దమైంది. 

ఇటువంటి ఆపత్ సమయంలో వైద్యులు, వైద్య సిబ్బంది విధులు బహిష్కరిస్తే ఏమవుతుందో తేలికగానే ఊహించవచ్చు. కనుక కేంద్రహోంమంత్రి అమిత్ షా స్వయంగా ఈరోజు ఉదయం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులతో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సమావేశమయ్యి వారితో చర్చలు జరిపి తక్షణమే తగిన చర్యలు తీసుకొంటామని హామీ ఇచ్చారు. 

మరికొద్ది సేపటికే ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన ఆయన నివాసంలో కేంద్రమంత్రివర్గం సమావేశమయ్యి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొంది. 

1. వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడులు చేసినవారికి నాన్ బెయిలబుల్ అరెస్ట్ చేయబడతారు. వారికి 3 నెలల నుంచి 5 సం.లు వరకు జైలు శిక్ష విధించబడుతుంది. జైలు శిక్షతో పాటు రూ.5,000 నుంచి రూ.2 లక్షలు జరిమానా కూడా ఆవిధించబడుతుంది. 

2. వైద్యులు, వైద్య సిబ్బందిని తీవ్రంగా గాయపరిచినా, వారికి ఉద్దేశ్యపూర్వకంగా కరోనా వ్యాపింపజేయాలని ప్రయత్నించినా ఆరు నెలల నుంచి ఏడేళ్ళ వరకు జైలు శిక్ష విధించబడుతుంది. దానితో పాటు పైన పేర్కొన్నట్లుగా జరిమానా కూడా విధించబడుతుంది.

3. ఈ కేసులపై విచారణ 30 రోజులలోగా పూర్తిచేసి శిక్షలు ఖరారు చేయబడతాయి. 

4. రోగులు, వారి బందువులు ఎవరైనా ఆసుపత్రులపై దాడులు చేసి ఆస్తినష్టం కలిగించినట్లయితే, మార్కెట్ విలువకు రెట్టింపు వసూలు చేయబడుతుంది. 

5. కరోనా రోగులకు, క్వారంటైన్‌లో ఉన్నవారికి సేవలు అందిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది, ఆశావర్కర్లకు ఒక్కొక్కరికీ రూ.50 లక్షల జీవితభీమా కల్పించబడుతుంది.         



Related Post