కరోనా ఎఫెక్ట్: సూర్యాపేట డీఎస్పీ, డీఎంహెచ్‌ఓలపై బదిలీ వేటు

April 22, 2020


img

రాజధాని హైదరాబాద్‌ తరువాత రాష్ట్రంలో సూర్యాపేట జిల్లాలోనే అత్యధికంగా కరోనా కేసులు నమోదు అవుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులపై బదిలీ వేటు వేసింది. జిల్లా వైద్యఆరోగ్య అధికారి డాక్టర్ నిరంజన్, జిల్లా డీఎస్పీ నాగేశ్వర్ రావులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

డాక్టర్ నిరంజన్ స్థానంలో డాక్టర్ బి.సాంబశివరావును నియమించింది. డీఎస్పీ నాగేశ్వర్ రావును హైదరాబాద్‌లోని డిజిపి  కార్యాలయానికి బదిలీ చేసి ఆయన స్థానంలో హైదరాబాద్‌ స్పెషల్‌ బ్రాంచ్‌ ఏసీపీగా పనిచేస్తున్న ఎస్‌.మోహన్‌కుమార్‌ను నియమించింది. 

సూర్యాపేట జిల్లాలో కరోనాను కట్టడి చేయడానికి గతంలో కరీంనగర్‌ జిల్లా కలక్టరుగా పనిచేసిన ఐఏస్‌ అధికారి సర్పారాజ్‌ను జిల్లా ప్రత్యేకాధికారిగా నియమించింది. అలాగే మున్సిపల్‌ పరిపాలనశాఖలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న జి.వేణుగోపాల్‌రెడ్డిని జిల్లా ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

 సిఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌, వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డిజిపి మహేందర్ రెడ్డి, మెడికల్‌ అండ్‌ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ నలుగురూ బుదవారం జిల్లాలో జిల్లాలో అత్యధికంగా కరోనా కేసులు నమోదు అవుతున్న మార్కెట్ బజారులో పర్యటించి ఆ ప్రాంతంలోని ప్రజలు, వ్యాపారులు, మునిసిపల్ సిబ్బందితో మాట్లాడి, అక్కడే కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతుండటానికి కారణాలు అడిగి తెలుసుకొన్నారు. అనంతరం స్థానిక అధికారులతో సమావేశమయ్యి పరిస్థితులను సమీక్షించి కొన్ని సూచనలు చేశారు.


Related Post