కరోనా తల్లి..చైనాకు కొత్త కష్టాలు తప్పవా?

April 22, 2020


img

కరోనా తల్లి అంటే చైనా దేశానికి ఊహించినట్లుగానే అంతర్జాతీయ స్థాయిలో కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ చైనాపై విరుచుకుపడుతున్నారు. కరోనా వైరస్ పుట్టిందా లేక వుహాన్‌ పరిశోధనశాలలో సృష్టించబడిందా లేక పొరపాటున వ్యాప్తి చెందిందా? అని సందేహాలున్నాయని, వాటిపై తమ నిఘా సంస్థలు నిగ్గుతేలుస్తాయని చెప్పారు. కరోనా వ్యాప్తిలో విషయంలో చైనాపై డోనాల్డ్ ట్రంప్‌ వ్యక్తం చేస్తున్న అనుమానాలు, అభిప్రాయాలతో బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాలు కూడా ఏకీభవిస్తున్నట్లు మాట్లాడాయి. తాజాగా అమెరికాలోని మిస్సౌరి రాష్ట్ర అటార్నీ జనరల్ ఎరిక్ స్థానిక కోర్టులో చైనాకు వ్యతిరేకంగా ఓ పిటిషన్‌ వేశారు. 

కరోనా పుట్టుక, వ్యాప్తి, నివారణ చర్యలు, పరిశోధనలు, సహాయచర్యలు... ఇలా ప్రతీ విషయంలో చైనా ప్రభుత్వం చాలా గుట్టుగా.. చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించి యావత్ మానవాళి మనుగడనే ప్రశ్నార్ధకంగా మార్చివేసిందని కనుక ఈవిషయంలో చైనాపై విచారణ జరపాలని పిటిషన్‌లో కోరారు. 

ఇక ఈ ఏడాది జనవరిలో అమెరికా-చైనాల మద్య జరిగిన వాణిజ్య ఒప్పందం ప్రకారం అమెరికాకు చెందిన 200 బిల్యాన్ డాలర్ల విలువగల ఉత్పత్తులను చైనా కొని తీరాల్సిందేనని, కరోనా సాకు చూపి తప్పించుకోవాలని ప్రయత్నిస్తే సహించబోనని హెచ్చరించారు.

కరోనా కారణంగా భారత్‌తో సహా ప్రపంచదేశాలన్నీ ఆర్ధికంగా తీవ్రంగా నష్టపోతున్నందున భవిష్యత్‌లో అన్ని దేశాలు చైనాతో పూర్తి భిన్నంగా వ్యవహరించే అవకాశాలున్నాయి. అదేవిధంగా కరోనా కారణంగా అనూహ్యమైన కష్టాలకు గురవుతూ ఆత్మీయులను కోల్పోతున్న ప్రపంచదేశాల ప్రజలు చైనా ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపకపోతే చైనా ఆర్ధికంగా చాలా నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుంది. 


Related Post