అమెరికా తలుపులు మళ్ళీ ఎప్పుడు తెరుచుకొంటాయో?

April 21, 2020


img

కరోనా...లాక్‌డౌన్‌ నేపధ్యంలో అమెరికాలో నిరుద్యోగ సమస్య పెరిగిపోతుండటంతో ఇతర దేశాలవారికి అమెరికాలో ఉద్యోగాలను కొంతకాలం నిషేదించబోతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ చేసిన తాజా ట్వీట్ ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నిర్ణయం అమలులోకి వస్తే హెచ్-1బీ వీసాల దరఖాస్తు చేసుకొన్నవారు..ఇకపై చేసుకోవాలనుకొంటున్నవారికి…ఐ‌టి కంపెనీలకు అమెరికా తలుపులు మూతపడినట్లే అవుతుంది. హెచ్-1బీ వీసాలను ఎక్కువగా వినియోగించుకొంటున్న భారత్‌, చైనా, పాకిస్తాన్, ఫిలిపిన్స్, ఇంకా కొన్ని ఆఫ్రికన్ దేశాలకు ఇది ఎదురుదెబ్బేనని చెప్పవచ్చు. 

కరోనా వైరస్‌కు వ్యాక్సిన్, మందులు కనుగొనేవరకు కరోనాను కట్టడి చేయడం కష్టమని ఇప్పటికే స్పష్టం అయ్యింది కనుక అంతవరకు అమెరికాలో ఉద్యోగాలు, ప్రాజెక్టులు ఇక లభించడం కష్టమేనని భావించవచ్చు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి కరోనాకు వ్యాక్సిన్ లేదా మందులు అందుబాటులోకి రావచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెపుతోంది కనుక అప్పటి వరకు ప్రపంచదేశాలన్నీ ఇదేవిధంగా గిరిగీసుకు కూర్చోక తప్పదు. 

గత ఎన్నికలలో “అమెరికన్లకే ఉద్యోగాలలో ప్రాధాన్యత” అనే నినాదంతో డోనాల్డ్ ట్రంప్‌ అధికారం చేజిక్కించుకొన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది నవంబర్ 4న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగవలసి ఉంది. కనుక ఆ ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకొనే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. కనుక కరోనాకు మందు కనుగొని ఆ మహమ్మారి నుంచి అమెరికా పూర్తిగా బయటపడేవరకు లేదా కనీసం అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిసేవరకు ఈ నిషేధం కొనసాగే అవకాశం ఉంది.


Related Post