దేశంలో మహారాష్ట్ర, మద్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, రాజస్థాన్ రాష్ట్రాలతో పాటు దేశరాజధాని డిల్లీలో కూడా శరవేగంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. మిగిలిన రాష్ట్రాలలో ఇప్పటివరకు 1,000లోపు కేసులే నమోదు అయినప్పటికీ, అక్కడా ప్రతీరోజు 25-50 కొత్త కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. దేశంలో లాక్‌డౌన్ అమలులో ఉన్నప్పటికీ కరోనా కేసులు సంఖ్య నానాటికీ పెరిగిపోతుండటం చూసి, ఎప్పటికైనా ఇవి తగ్గుతాయా లేదా? అనే భయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇటువంటి క్లిష్ట సమయంలో మణిపూర్, గోవా రాష్ట్రాలు 100 శాతం కరోనా రహితంగా మారాయని ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, “రాష్ట్రంలో కరోనా సోకిన ఏడుగురు పూర్తిగా కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఏప్రిల్ 3 తరువాత రాష్ట్రంలో కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కనుక గోవా కరోనా నుంచి విముక్తి పొందిందని ప్రకటించడానికి చాలా సంతోషిస్తున్నాను. ఇందుకు దోహదపడిన వైద్యసిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. అయినప్పటికీ మే 3వరకు రాష్ట్రంలో యధాతధంగా లాక్‌డౌన్ అమలుచేస్తాము,” అని ట్వీట్ చేశారు.
మణిపూర్ ముఖ్యమంత్రి బీరేందర్ సింగ్ ట్వీట్ చేస్తూ, “మణిపూర్ రాష్ట్రంలో కరోనా సోకిన ఇద్దరు పూర్తిగా కోలుకొన్నారు. మళ్ళీ కొత్తగా పాజిటివ్ కేసులు ఏవీ నమోదు కాలేదు. లాక్‌డౌన్ అమలుకు రాష్ట్ర ప్రజలందరి సహకరించడం, వైద్య సిబ్బంది కృషి వలన ఇది సాధ్యం అయ్యింది,” అని ట్వీట్ చేశారు.