మే 7వరకు ఎవరూ రాష్ట్రానికి రావొద్దు: కేసీఆర్‌

April 20, 2020


img

సిఎం కేసీఆర్‌ నిన్న ప్రగతి భవన్‌లో ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ, “కేంద్రప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ మే4వ తేదీతో ముగుస్తుంది కనుక ఆ మరుసటిరోజు నుంచి దేశీయవిమాన సేవలు ప్రారంభం అవుతున్నాయని విన్నాను. కానీ రాష్ట్రంలో మే 7వరకు లాక్‌డౌన్‌ పొడిగించాము కనుక అప్పటివరకు ఇతర రాష్ట్రాలలో ఉన్నవారు ఎవరూ హైదరాబాద్‌కు వచ్చేందుకు ప్రయత్నించవద్దు. ఒకవేళ వస్తే ఇక్కడ ఎయిర్ పోర్టు నుంచి బయటకు వెళ్లడానికి టాక్సీలు, బస్సులు, ఆటోలు ఏమీ ఉండవు. నగరంలో హోటల్స్, లాడ్జీలు ఉండవు. కనుక ఇబ్బందిపడవలసి వస్తుంది. శంషాబాద్ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న జీఎంఆర్‌ సంస్థ యాజమాన్యానికి కూడా ఈవిషయం తెలియజేసి తదనుగుణంగా చర్యలు తీసుకోమని కోరుతాము,” అని చెప్పారు. 

ఇదేవిషయమై తెలంగాణ ప్రభుత్వం కేంద్రప్రభుత్వానికి ఒక లేఖ వ్రాయబోతున్నట్లు సమాచారం. మే5నుంచి విమానసేవలు ప్రారంభించేందుకు విమానయాన సంస్థలు టికెట్స్ బుకింగ్స్ మొదలుపెట్టాలనుకొన్నాయి. కానీ తదుపరి ఆదేశాలు వెలువడేవరకు టికెట్ బుకింగ్స్ చేయవద్దని పౌరవిమానయాన సంస్థ నిన్న తాజాగా ఆదేశాలు జారీ చేసింది.


Related Post